ఆదిలాబాద్, ఏప్రిల్ 14(నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ జిల్లాలో రైతుల పరిస్థితి అధ్వానంగా ఉంది. పంటల కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తున్నది. దీంతో రైతులు నష్టపోవాల్సిన దుస్థితి నెలకున్నది. ఈ ఏడాది యాసంగిలో 79 వేల ఎకరాల్లో రైతులు జొన్న సాగు చేశారు. జిల్లాలో ఏటా యాసంగిలో శనగ పంట అధికంగా సాగవుతుంది. జొన్న సాగు లాభదాయకంగా ఉండడంతో ఈ ఏడాది శనగ కంటే జొన్న విస్తీర్ణం బాగా పెరిగిం ది. సాగు నీటి కొరత, ఇతర సమస్యలను ఎదురించి రైతు లు పంట తీశారు. యాసంగిలో రైతులు సాగు చేసిన జొన్న 14 లక్షల క్వింటాళ్ల వరకు విక్రయానికి వచ్చే అవకాశం ఉండడంతో అధికారులు కొనుగోళ్లకు ఏర్పాట్లు చేస్తున్నారు. మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో ఆదిలాబాద్, జైనథ్, ఇచ్చోడ, బోథ్, ఇంద్రవెల్లి, నేరెడిగొండ, సిరికొండ, ఉట్నూర్‌లలో పంటను సేకరించాలని నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది జొన్న క్వింటాలుకు రూ.3,371 మద్దతు ధర ప్రకటించింది. మూడు రోజుల కింద బోథ్ మండలంలోని ధనోరలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.
కొనేది 8.65 క్వింటాళ్లు మాత్రమే..
రైతులు కష్టపడి సాగు చేసిన పంట కొనుగోళ్లలో ప్రభు త్వం నిబంధనలు విధించడంతో రైతులు నష్టపోవాల్సిన పరిస్థితి నెలకున్నది. ఎకరాకు 18 క్వింటాళ్ల వరకు దిగుబడులు వ చ్చాయి. జిల్లా వ్యాప్తంగా రైతులు ఇప్పటికే పంటను తీసి చేలు, ఇతర ప్రాంతాల్లో నిల్వచేసి, కొనుగోలు కేంద్రాలు ఎప్పుడు ప్రారంభమవుతాయని ఎదురు చూస్తున్నారు. పండించిన జొన్నలను ఎకరాకు కేవలం 8.65 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తామ ని అధికారులు ప్రకటించడంతో రైతులు ఆందోళన చెం దుతున్నారు. ఇటీవల ప్రజావాణిలో కలెక్టర్‌ను కలిసిన రైతులు ఎకరాకు 18నుంచి 20 క్వింటాళ్లు కొనుగోలు చేయాలని వినతిపత్రం అందించారు.ప్రైవేటు వ్యాపారులు క్వింటాల్‌కు రూ. 2500 చొప్పున కొనుగోలు చే స్తున్నారు. పంట కొనుగోళ్లపై సీలింగ్ కారణంగా రైతు లు ప్రైవేటు వ్యాపారులకు విక్రయించి భారీగా నష్టపోయే ప్ర మాదముంది. కొనుగోళ్ల పరిమితిని పెంచాలని సర్కా ర్కు లేఖలు రాసినట్లు అధికారులు తెలిపారు.
18 క్వింటాళ్లు కొనాలి..
నేను యాసంగిలో 20 ఎకరాల్లో జొన్న సాగు చేశా. ఆరెకరాలు సొంత భూమి కాగా 14 ఎకరాలు కౌలుకు తీసుకున్నా. పంట గింజ దశలో ఉండగా భూగర్భజలాలు అండుగంటి నీరు అందక ఇబ్బందులు పడాల్సి వచ్చింది. కాలువ ద్వారా నీటిని మళ్లించి పంటకు నీరు అందించాను. పంట చేతికి వచ్చి 10 రోజులు దాటిన ఇంకా కొనుగోళ్లు ప్రారంభించ లేదు. దీంతో చేల వద్ద నిల్వ చేసిన పంటకు రాత్రి, పగలు కాపలా ఉండాల్సి వస్తుంది. పంట కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం నిబంధనలు విధించడం సరికాదు. ఎకరాకు 18 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చింది. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ఎకరాకు 8.65 క్వింటాళ్లు తీసుకుంటామని అధికారులు అంటున్నారు. పండించిన సగం పంట ఎక్కడ అమ్ముకో వాలి. ప్రైవేటులో రూ.2,500 క్వింటాలు కొంటున్నారు. దీంతో రైతులు ఎకరాకు రూ.900 వరకు నష్టపోవాల్సి వస్తుంది. ప్రభుత్వం స్పందించి రైతులు పండించిన పంట మొత్తం కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలి.
– శార్థ నవీన్, రైతు, కజ్జర్ల, తలమడుగు మండలం