కుభీర్ : నిర్మల్ జిల్లా కుభీర్ మండలం రంజని గ్రామంలో బుధవారం ప్రమాదవశాత్తు నిప్పంటుకొని పశువుల పాక (Cattle Shed ) దగ్ధమైంది. మధ్యాహ్నం పశువులపాక నుండి ఒక్కసారిగా మంటలు ( Fire Incident ) ఎగిసిపడడంతో గమనించిన స్థానికులు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు.
భైంసా అగ్నిమాపక సిబ్బంది సకాలంలో సంఘటన స్థలానికి చేరుకొని మంటలు ఆర్పి వేయడంతో పక్కనున్న ఇండ్లకు ఎలాంటి నష్టం కలగకపోవడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. పశువుల పాకలోని మొత్తం సామగ్రి కాలిపోవడంతో బాధిత రైతు లబోదిబోమన్నాడు.
పశువుల పాకలోని విలువైన వ్యవసాయ కలప పనిముట్లు, పైపులు, పశుగ్రాసం, స్ప్రే పంపులతో పాటు ఇతర సామాగ్రి కాలి బూడిదయ్యిందని, సుమారు రూ. 3 లక్షల వరకు ఆస్తినష్టం జరిగిందని బాధితుడు తెలిపారు. రెవెన్యూ అధికారులు పంచనామా నిర్వహించారు. నివేదికను జిల్లా ఉన్నతాధికారులకు పంపించినట్లు తెలిపారు.