జై నూర్ : ఎస్సీలకు ఎమ్మార్వో( MRO) ద్వారానే కుల ధృవీకరణ పత్రాలను( Caste certificates ) అందించాలని మాంగ్ సమాజ్ జిల్లా అధ్యక్షుడు మొహాలే దత్త కోరారు. ఈ మేరకు శనివారం అసిఫాబాద్ ఆర్డీవోకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత చదువులకు వెళ్లేందుకు అవసరమయ్యే పత్రాలు అందజేసినా కూడా ఆర్డీవో కార్యలయం నుంచి వచ్చేసరికి తీవ్ర జాప్యం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం నిబంధన మేరకు రెండు గెజిటెడ్ ఆఫీసర్ల సంతకాలు, వ్యక్తిగత బాండ్ పేపరు, ఆధార్ కార్డు , రేషన్ కార్డు, రెసిడెన్సి సర్టిఫికెట్ సహా పలు పత్రాలను ఎమ్మార్వో కార్యాలయానికి అందించిన తరువాత అక్కడి నుంచి ఆర్డీవో కార్యాలయాలకు చేరుకుని విద్యార్థులకు సర్టిఫికేట్లు అందేందుకు 15 రోజుల సమయం పడుతుందని పేర్కొన్నారు. విద్యార్థుల సమస్యను గుర్తించి ఎమ్మార్వోల ద్వారానే కుల ధృవీకరణ పత్రాలను అందించాలని కోరారు.