ఖానాపూర్ , ఆగస్టు 19 : రైతులు పండించిన ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేసి కస్టం మిల్లింగ్ కోసం(సీఎంఆర్) ఆయా జిల్లాల్లోని రైస్ మిల్లులకు అప్పగించారు. ఈ ధాన్యాన్ని బియ్యంగా మార్చి ప్రభుత్వ నిబంధనల ప్రకారం సీఎంఆర్ పెట్టాలి. అయితే, కొందరు మిల్లర్లు సకాలంలో సీఎంఆర్ పెట్టకుండా జాప్యం చేయడం, మొండికేయడం, బహిరంగ మారెట్లో అమ్ముకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అక్రమారులపై ఉకుపాదం మోపేందుకు సిద్ధమైన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పకా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. సీఎంఆర్ పెండింగ్ ఉన్న మిల్లర్ల జాబితాను సిద్ధం చేసి సివిల్ సప్లయ్ అధికారులతో కలిసి దాడులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ ధాన్యాన్ని పకదారి పట్టించిన మిల్లర్ల గుట్టును రట్టు చేస్తున్నారు. ధాన్యం నిల్వలు, సివిల్ సప్లయ్ నిబంధనల అమలు, ప్రభుత్వానికి అప్పగించాల్సిన బియ్యం నిల్వలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించడంతో మిల్లర్లలో ఆందోళన నెలకొన్నది. ఇందులో భాగంగానే నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని సత్తనపల్లిలోని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత అజ్మీరా రేఖానాయక్‌కు చెందిన ఏఆర్ఎస్ అగ్రో ఇండస్ట్రీస్ రైస్ మిల్లులో ఈనెల 18(మంగళవారం) విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి ధాన్యం భారీగా కొరత ఉన్నట్లు గుర్తించారు. రబీ 2022-23, 2023-24, 2024-25 సీజన్లకు సంబంధించి మిల్లుకు కేటాయించిన ప్రభుత్వ ధాన్యంలో మొత్తం 9,639.962 మెట్రిక్ టన్నుల కొరత ఉన్నట్లు భౌతిక తనిఖీల్లో తేల్చారు. ఆయా సీజన్ల కనీస మద్దతు ధర(ఎంఎస్పీ) ప్రకారం కొరత ధాన్యం విలువ సుమారు రూ.40.96 కోట్లుగా అధికారులు అంచనా వేశారు.
టీజీఎస్‌సీఎస్‌సీఎల్ తరఫున ఏఆర్ఎస్ ఇండస్ట్రీస్‌కు కస్టమ్ మిల్లింగ్ కోసం రబీ 2022-23, 2023-24, 2024-25 సీజన్లలో ప్రభుత్వ ధాన్యం కేటాయించా రు. మిల్లుతో కుదిరిన ఒప్పందం ప్రకారం ధాన్యాన్ని మిల్లింగ్ చేసి సీఎంఆర్‌ను ప్రభుత్వానికి అందించాలి. అయితే రికార్డుల ప్రకారం కేటాయించిన ధాన్యానికి, అందించిన సీఎంఆర్‌కు మధ్య భారీ వ్యత్యాసం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. రబీ 2022-23లో 6,821.640 మెట్రిక్ టన్నుల ధాన్యం కేటాయించగా, 4,638. 715 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ ఇవ్వాలి. ఇప్పటివరకు 831.071 మెట్రిక్ టన్నులు మాత్రమే అందించారు. 116.541 మెట్రి క్ టన్నుల వేలం ధాన్యాన్ని మినహాయిం చి 5,482.936 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉండాల్సి ఉండగా.. తనిఖీలో ధాన్యం, బియ్యం నిల్వలు నిల్‌గా తేలా యి. రబీ 2023-24లో 7,430.840 మెట్రిక్ టన్నుల ధాన్యం కేటాయించగా, 5,052.971 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ ఇవ్వాలి. ఇప్పటివరకు 3,205.269 మెట్రిక్ టన్నులు మాత్రమే అందించారు. 2,717.209 మెట్రిక్ టన్నుల ధాన్యం అందుబాటులో ఉండాల్సి ఉండగా, మిల్లులో ధాన్యం, బియ్యం నిల్వలు లభించలేదు. రబీ 2024-25లో 2,413.640 మెట్రిక్ టన్నుల ధాన్యం కేటాయించగా, 1,641.275 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ ఇవ్వాల్సి ఉంది. ఇప్పటివరకు 343.200 మెట్రిక్ టన్నులు మాత్రమే అందించారు. 1,908.934 మెట్రిక్ టన్నుల ధాన్యం అందుబాటులో ఉండాల్సి ఉండగా, భౌతిక తనిఖీలో 469.117 మెట్రిక్ టన్నులు మాత్రమే లభించాయి.
ప్రభుత్వ ధాన్యం దుర్వినియోగం, నమ్మకద్రోహం ఆరోపణలపై టీజీఎస్‌సీఎస్‌సీఎల్ నిర్మల్ జిల్లా మేనేజర్ సీహెచ్. సుధాకర్ ఖానాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు ఏఆర్ఎస్ ఇండస్ట్రీస్ యజమాని అజ్మీరా రేఖాశ్యామ్ నాయక్‌పై ఖానాపూర్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నంబర్ 165/2026 నమోదు చేశా రు. బీఎన్ఎస్ సెక్షన్లు 316(2), 316(5), 318(4), అత్యవసర వస్తువుల చట్టం సెక్ష న్ 7 కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రభుత్వ ధాన్యం దుర్వినియోగం, ప్రభుత్వానికి జరిగిన ఆర్థిక నష్టం, సీఎంఆర్ బకాయిలు వంటి అంశాలపై దర్యాప్తు కొనసాగుతున్నది.