ఇంద్రవెల్లి : ఆదివాసీలకు రాజ్యాంగ బద్ధమైన హక్కుల ( Adivasi Rights ) పరిరక్షణతో పాటు, దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ఐటీడీఏ ( ITDA ) కేంద్రాల ముట్టడి, ప్రదర్శన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తుడుందెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి పూర్కా చిత్రు ( Chitru ) వెల్లడించారు.
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని దొండందా, గట్టెపల్లి గ్రామాల్లో బుధవారం ఆదివాసీ మార్చ్ కార్యక్రమంలో భాగంగా హలో ఆదివాసీ-చలో ఐటీడీఏ ఉట్నూర్ గోడపత్రికలను తుడుందెబ్బ, ఆదివాసీ విద్యార్థి సంఘం నాయకుల ఆధ్వర్యంలో విడుదల చేశారు.
సెప్టెంబర్ 16న ఉట్నూర్లో , 21న భద్రాచలంలో, 28న మన్ననూరులో ఉమ్మడి మహబూబ్ నగర్ కేంద్రాల్లో ముట్టడి ఉంటుందన్నారు. 1976 నుంచి ఎస్టీ జాబితాలో అక్రమంగా కొనసాగుతున్న లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని, ఎస్టీ జాబితాను పునఃపరిశీలన చేసి, రిజర్వేషన్ అంశంపై జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
ఐటీడీఏ పరిధిలోనే ఉద్యోగాల భర్తీ, ప్రమోషన్లు చేపట్టాలని కోరారు. డీఎస్సీ, పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల్లో 75 శాతం స్థానిక ఏజెన్సీ ఆదివాసీల అభ్యర్థులకు కేటాయించాలని కోరారు. పోడు భూములకు పట్టాలు మంజూరు చేయాలని, అటవీ శాఖ అధికారుల వేధింపులు నిలిపివేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఎస్యూ మండల అధ్యక్షులు గేడం లాలు, ఉపాధ్యక్షులు ఆత్రం రమేష్, ఉట్నూర్ మండల కార్యదర్శి దుర్వ జైవంత్ రావ్, కుమ్రం శ్యాంరావ్ తదితరులు పాల్గొన్నారు.