నిర్మల్ అర్బన్, ఆగస్టు 19 ః ప్రజా సంక్షేమానికి కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన కల్యాణలక్ష్మి- షాదీముబారక్ పథకాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం నిర్మల్లో ర్యాలీ నిర్వహించారు. ఆర్డీవో కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. అనంతరం ఆర్డీవోకు నాయకులు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా నిర్మల్ నియోజకవర్గ ఇన్చార్జి రాంకిషన్రెడ్డి, పట్టణ అధ్యక్షుడు మారుగొండ రాము మాట్లాడారు. కాంగ్రెస్ సర్కారు కల్యాణలక్ష్మి-షాదీముబారక్ పథకాన్ని అమలు చేయంలో పూర్తిగా విఫలమయ్యారని, ఇంకా ఆడబిడ్డలకు తులం బంగారం ఇస్తామని చెప్పి మోసం చేశారని మండిపడ్డారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కొనసాగిస్తూ ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయాలని, లేనిచో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు సుభాష్రావు, అయ్యన్నగారి రాజేందర్, కౌన్సిలర్ శ్రీకాంత్ యాదవ్, భూషణ్ రెడ్డి, గండ్రత్ రమేశ్, మహేశ్ రెడ్డి, పాతర్ల హరీశ్, రిజ్వాన్, షోహెబ్ పాల్గొన్నారు.
భైంసా, ఆగస్టు 19 : కల్యాణలక్ష్మి-షాదీముబారక్ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని ముథోల్ నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు విలాస్ గాదేవార్ డిమాండ్ చేశారు. బుధవారం గాంధీ గంజ్ నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ తీశారు. అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయంలో బైఠాయించి మాట్లాడారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాన్ని నిర్వీర్యం చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు పన్నుతున్నదని మండిపడ్డారు. ఇందులో బీఆర్ఎస్ నాయకులు సుంకెట పోశెట్టి, కపిల్, సురేశ్, సజన్, వాసే, అజీజ్ ఖురేషి ఉన్నారు.