మందమర్రి, జూన్ 22 : మందమర్రి మున్సిపాలిటీ పరిధిలోని చొప్పరిపల్లి గ్రామంలో కోర్టు ఆదేశాలను ధిక్కరించి కాంగ్రెస్ నాయకుడు జుమ్మిడి విశ్వనాథ్ చేపట్టిన అక్రమ నిర్మాణాన్ని కూల్చివేయాలని బాధితురాలితో పాటు బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. బీఆర్ఎస్ నాయకుడు, న్యాయవాది ఎంవీ గుణ, పీవోడబ్ల్యూ నాయకురాలు మద్దెల భవాని మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలోని చొప్పరిపల్లి గ్రామానికి చెందిన వడాల దుర్గమ్మకు వారసత్వంగా వచ్చిన సర్వే నంబర్ 146/63లో గల ఎకరం భూమిని, అదే గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు జుమ్ముడి విశ్వనాథ్ ఆక్రమించి అక్రమ నిర్మాణం చేపట్టాడని తెలిపారు.
దుర్గమ్మ కొంతకాలంగా భీమారంలోని తన కూతురు వద్ద ఉంటోందని, అట్టి భూమికి సంబంధించి దుర్గమ్మకు పట్టా కూడా ఉందన్నారు. గ్రామంలో దుర్గమ్మ లేక పోవడంతో విశ్వనాథ్ అట్టి భూమి తనదేనని చెప్పి అక్రమ నిర్మాణం చేపట్టాడని, ఇదేమిటని ప్రశ్నిస్తే ఆ భూమి తనదేనని బుకాయిస్తున్నాడన్నారు. అక్రమ నిర్మాణాన్ని అడ్డుకుని వారసత్వంగా వచ్చిన భూమిని ఇప్పించాలని సంబంధిత మున్సిపల్, రెవెన్యూ అధికారులకు విన్నవించినా ఫలితం లేకపోవడంతో హైకోర్టులో కేసు వేసినట్లు చెప్పారు.
ఈ ఏడాది ఫిబ్రవరి 28న రాష్ట్ర హైకోర్టు అక్రమ నిర్మాణాన్ని నిలిపి వేయాలని ఆదేశాలు జారీ చేసిందని వారు పేర్కొన్నారు. కోర్టు ఆదేశాలను సైతం ధిక్కరించి విశ్వనాథ్ తన అక్రమ నిర్మాణాన్ని కొనసాగిస్తున్నాడని వారు పేర్కొన్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు దుర్గమ్మకు న్యాయం చేయాలని వారు కోరారు. దీని పై మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు స్పందిస్తూ మున్సిపాలిటీ పరిధిలో అక్రమ నిర్మాణాలను తొలగించడానికి డీటీఎఫ్ను ఏర్పాటు చేయడం జరిగిందని, కమిటీతో చర్చించి వారంలో చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మహిళా నాయకురాలు బొడ్డు వినోద, శిరీష, రజిత పాల్గొన్నారు.