ఎదులాపురం/బోథ్/భైంసా, డిసెంబర్ 9 : ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో విజయ్ దివస్‌ను మంగళవారం బీఆర్ఎస్ నాయకులు పండుగలా జరుపుకున్నారు. బీఆర్ఎస్, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయల్లో తెలంగాణ తల్లి, కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఆదిలాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి జోగు రామన్న అంబేదర్తోపాటు తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలాభిషేకం చేశారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. బోథ్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తెలంగాణ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు.
నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బస్టాండ్ సమీపంలో గల అంబేద్కర్ విగ్రహం ఎదుట తెలంగాణ తల్లి చిత్రపటానికి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి ముథోల్ నియోజకవర్గ బీఆర్ఎస్ సమన్వయ సమితి సభ్యులు విలాస్ గాదేవార్, పడకంటి రమాదేవి, లోలం శ్యాంసుందర్, డాక్టర్ కిరణ్ కొమ్రేవార్ పాలాభిషేకం చేశారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి బెలూన్లను ఎగురవేశారు. అక్కడే ఉన్న ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి వెళ్లి రోగులకు పండ్లు పంపిణీ చేశారు.

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమ సారధి కేసీఆర్ 11 రోజులపాటు ఆమరణ దీక్ష చేసి, ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ ప్రకటన వెలువడేలా చేసిన రోజు అని మాజీ మంత్రి జోగు రామన్న పేర్కొన్నారు. నేడు పండగలా నిర్వహించుకుంటూ నీళ్లు, నిధులు, ఉద్యోగ కల్పన, ఐటీ పరిశ్రమలు, ప్రాజెక్టులు, విద్య, ఆరోగ్యం, ప్రజా సంక్షేమం సాధించుకో గలిగామన్నారు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వంగా పని చేస్తున్న కాంగ్రెస్ నియంతృత్వ పాలనపై ఉద్యమిస్తామన్నారు. రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నామని కేసీఆర్ ప్రకటించిన రోజును విజయ్ దివస్‌గా జరుపుకుంటున్నామని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పేర్కొన్నారు.