క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయడం.. కార్యకర్తల అభిప్రాయాలు, మనోభావాలను పంచుకోవడానికి ఆత్మీయ సమ్మేళనాలు మేలు చేస్తాయి. కమిటీల్లో ఖాళీలను పూర్తి చేసి.. మండల, గ్రామ, మహిళా కమిటీలను వేసుకోవాలి. ప్రతి మండల కేంద్రంలో వచ్చే నెల 14న అంబేద్కర్ జయంతి ఉత్సవాలను గొప్పగా నిర్వహించాలి.
– బీఆర్ఎస్ ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల ఇన్చార్జి గంగాధర్ గౌడ్
ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేసిన వారందరికీ కృతజ్ఞతలు. నిర్మల్ జిల్లాలో 17 చోట్ల సమ్మేళనాలు నిర్వహిస్తాం. దాదాపు రెండు గంటలపాటు ఓపికగా కూర్చొన్న మహిళలకు ధన్యవాదాలు. నేడు(శుక్రవారం) దిలావర్పూర్ మండలంలోని సిర్గాపూర్‌లో జరిగే సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నా.
– మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి
భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) హ్యాట్రికే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు పని చేయాలని.. పార్టీ పటిష్టానికి కృషి చేస్తున్న వారికి వెన్నుదన్నుగా నిలిచి, రాజకీయ భరోసా ఇవ్వడానికే ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నామని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల ఇన్చార్జి వీ.గంగాధర్‌గౌడ్ పేర్కొన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే మొదటి ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్మల్ జిల్లా నర్సాపూర్(జీ) మండల కేంద్రంలో గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఐకేరెడ్డి, గంగాధర్‌గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించారు. తెలంగాణ సర్కారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను, అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత శ్రేణులపై ఉందని సూచించారు. బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు ఒక్క పైసా ఇవ్వక పోగా.. ఏ ముఖం పెట్టుకొని పల్లెల్లోకి వస్తున్నారని విమర్శించారు. అనవసరంగా, తప్పుడు ప్రచారం చేస్తూ విద్వేషాలను రెచ్చగొడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.
నిర్మల్, మార్చి 23(నమస్తే తెలంగాణ) : తొమ్మిదేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, జిల్లా ఇన్చార్జి వీ.గంగాధర్‌గౌడ్ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. గురువారం నిర్మల్ జిల్లా నర్సాపూర్(జీ) మండల కేంద్రంలో జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ముథోల్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఆత్మీయ సమ్మేళనానికి ఎమ్మెల్సీ దండే విఠల్, జడ్పీ చైర్పర్సన్ కొరిపెల్లి విజయలక్ష్మి రాంకిషన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్‌రెడ్డి హాజరయ్యారు. కాగా.. ఈ సమ్మేళనానికి నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ముందుగా గ్రామాలవారీగా సర్పంచ్‌లు తమ గ్రామాల్లో జరిగిన అభివృద్ధిని వివరించారు. చివరగా మాట్లాడిన ముఖ్యనేతలు బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం సాధించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.
సీఎం కేసీఆర్ నాయకత్వంలో 14 ఏళ్లపాటు పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని, తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకొని దేశానికే రోల్ మోడల్‌గా నిలిపిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. తొమ్మిదేళ్లుగా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగిస్తున్నారన్నారు. రాబోయే అన్ని ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధిస్తుందనే ధీమా వ్యక్తం చేశారు. ఇందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు సూచించారు. పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని వివరించారు. ఈ క్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు వీలైనంత వరకు ప్రజల్లోనే ఉండాలన్నారు.
ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత కరెంటు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ఆసరా పింఛన్లు, కేసీఆర్ కిట్లు, ఉచిత చేపపిల్లల పంపిణీ, సబ్సిడీపై గొర్రెల పంపిణీ, దళితబంధు లాంటి అనేక పథకాలు చాలా మంది జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయన్నారు. అంతే కాకుండా విద్య, వైద్య రంగాలకు కోట్లాది రూపాయలను ప్రభుత్వం కేటాయిస్తున్నదని తెలిపారు. కేజీ టూ పీజీ విద్యతోపాటు పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలకు కార్పొరేటు స్థాయి వైద్యాన్ని పూర్తి ఉచితంగా అందజేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని స్పష్టం చేశారు. దేశంలో ఎక్కడా కూడా ఇలాంటి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు కావడం లేదన్నారు. ఇతర రాష్ర్టాల్లో పరిస్థితి చాలా దారుణంగా ఉందని పేర్కొన్నారు. పొరుగు రాష్ర్టాలైన మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లలో బడుగు, బలహీనవర్గాల జీవితాలు ఎలా ఉన్నాయో ఇటీవలే ఆయా రాష్ర్టాల్లో పర్యటించినప్పుడు కళ్లారా చూశామని తెలిపారు.
అట్టడుగువర్గాల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ జాతీయ పార్టీని ఏర్పాటు చేశారని తెలిపారు. మహారాష్ట్రతోపాటు ఇతర రాష్ర్టాల్లో కూడా తెలంగాణ మాడల్ కావాలని అక్క డి ప్రజలు కోరుకుంటున్నారన్నారు. ఒక వైపు సీఎం కేసీఆర్ తెలంగాణను అభివృద్ధి చేసేందుకు నిరంతరం శ్రమిస్తుంటే.. అ సలు తెలంగాణ అభివృద్ధి, ఈ ప్రాంత ప్రజల సంక్షేమం పట్టని బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాదయాత్రల పేరిట తెలంగాణ మీద దండయాత్ర చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు ఒక్క పైసా ఇవ్వక పోగా.. ఏ ముఖం పెట్టుకొని పల్లెల్లోకి వస్తున్నారని విమర్శించారు. మేము తలుచుకుంటే బీజేపీ, కాంగ్రెస్ నాయకులు గ్రామాల్లో తిరగలేరని, మా కార్యకర్తలు ఎంతో ఓర్పుతో ఉన్నారన్నారు. అనవసరంగా, తప్పుడు ప్రచారం చేస్తూ విధ్వేషాలను రెచ్చగొడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. మరోవైపు కేం ద్రంలోని బీజేపీ ప్రభుత్వం బీజేపీ యేతర రాష్ర్టాల్లో ఈడీ, సీబీ ఐ, ఐటీ దాడులు చేయిస్తూ భయపెట్టాలని చూస్తున్నదన్నారు. ఎమ్మెల్సీ కవితపై విచారణ పేరిట వేధింపులకు గురి చేస్తున్నారన్నారు. ఎన్ని కుట్రలు పన్నినా ప్రజ లు సీఎం కేసీఆర్ వెంటే ఉంటారన్న విషయాన్ని మర్చిపోవద్దన్నారు.
బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసేందుకు పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశం మేరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే మొదటి ఆత్మీయ సమ్మేళనాన్ని నర్సాపూర్(జీ)లో నిర్వహించుకుంటున్నామని జిల్లా ఇన్చార్జి వీ గంగాధర్ గౌడ్ అన్నారు. పార్టీ పటిష్టానికి కృషి చేస్తున్న నాయకులు, కార్యకర్తలకు వెన్నుదన్నుగా ఉండి రాజకీయంగా వారికి భరోసానివ్వడానికే ఈ సమ్మేళనాలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారన్నారు. రాబోయే అన్ని ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా కార్యకర్తలను సిద్ధం చేయడంతోపాటు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ఇంటింటికీ ప్రచారం చేసేలా కార్యకర్తలు కృషి చేయాలన్నారు.
కేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంతోపాటు కార్యకర్తల అభిప్రాయాలు, వారి మనోభావాలను పంచుకునేందుకు ఈ ఆత్మీయ సమ్మేళనాలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీని విస్తరించేందుకు మండల, గ్రామీణ స్థాయిలో కరపత్రాల ద్వారా పథకాలను ఇంటింటికీ చేరవేయాలన్నారు. రాబోయే ఎన్నికలకు ఇప్పటి నుంచే పార్టీ శ్రేణులు సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్, బీజేపీలకు కనీసం పోటీ చేసేందుకు అభ్యర్థులు కూడా లేరని, అలాంటి వారే దుష్ప్రచారం చేస్తున్నారన్నారు.
కమిటీల్లో ఖాళీలను పూర్తి చేసి మండల, గ్రామ కమిటీలు, మహిళా కమిటీలను వేసుకోవాలని సూచించారు. పార్టీ శ్రేణులు క్రియాశీలకంగా ఉంటూ, ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలన్నారు. వచ్చే నెల 14న అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ప్రతి మండల కేంద్రంలో జయంతి ఉత్సవాలను నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ చిన్న రామయ్య, ఎంపీపీ కొండ్ర రేఖ రమేశ్, స్థానిక ఎంపీటీసీ మల్లేశ్, సర్పంచ్ రాంరెడ్డి, రైతుబంధు సమితి కన్వీనర్ గంగారెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ బర్కుంట గంగారాం, పార్టీ మండల కన్వీనర్ పాపెన్ రాజేశ్వర్ పాల్గొన్నారు.