మంచిర్యాల, మే 21(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : బీఆర్ఎస్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా సభ్యత్వ నమోదు, సభ్యత్వ పునరుద్ధరణ కార్యక్రమానికి స్వీకారం చుట్టింది. సభ్యత్వ నమోదుకు ఉద్దేశించిన డిజిటల్ యాప్ తుది మెరుగులు దిద్దుకుంటున్నది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సభ్యత్వ నమోదుకు నియోజకవర్గాలవారీగా ఇన్చార్జిలను నియమించారు. నియోజకవర్గ ఇన్చార్జితోపాటు ఒక ఐటీ నిపుణుడికి తెలంగాణ భవన్లో డిజిటల్ యాప్‌పై శిక్షణ ఇవ్వనున్నారు. ఈ మేరకు డిజిటల్ యాప్ తుది మెరుగులు దిద్దుకుంటున్నది.
శిక్షణ అనంతరం పార్టీ జిల్లా కార్యాలయాల్లో ఇప్పటికే నియమించిన పార్టీ ప్రధాన కార్యదర్శులు, నియోజకవర్గాల ఇన్చార్జిలు క్షేత్రస్థాయిలో బూత్‌కు ఇద్దరు చొప్పున శిక్షణ శిబిరాలు నిర్వహిస్తారు. అనంతరం సభ్యత్వ నమోదు, పునరుద్ధరణ తేదీని ప్రకటిస్తారు. అలా ప్రకటించిన రోజునే పార్టీ అధినేత కేసీఆర్‌సహా పార్టీ ముఖ్యులందరూ సభ్యత్వ పునరుద్ధరణ నమోదులో పాల్గొంటారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ ప్రక్రియ పూర్తయ్యాక గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమం పండుగ వాతావరణంలో నిర్వహించి, పార్టీలో కొత్త జోష్ నింపేందుకు బీఆర్ఎస్ నాయకులు సిద్ధమవుతున్నారు.
