రామకృష్ణాపూర్, ఏప్రిల్ 4 : రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేపిన క్యాతనపల్లి మున్సిపాలిటీని బీఆర్ఎస్-సీపీఐ కూటమి దక్కించుకున్నది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన 17వ వార్డు కౌన్సిలర్ గొడిసెల సంధ్యారాణి చైర్ పర్సన్‌గా, సీపీఐ పార్టీకి చెందిన 22వ వార్డు కౌన్సిలర్ మిట్టపల్లి సరిత వైస్ చైర్ పర్సన్‌గా శనివారం ప్రమాణస్వీకారం చేశారు. క్యాతనపల్లి మున్సిపాలిటీకి జరగిన ఎన్నికల్లో మొత్తం 22 వార్డులకుగాను బీఆర్ఎస్ 10 వార్డుల్లో గెలువగా, సీపీఐ పార్టీ 4 వార్డుల్లో గెలిచింది. కాంగ్రెస్ కేవలం 7 స్థానాల్లోనే గెలువగా, ఎలాగైనా మున్సిపల్ పీఠం దక్కించుకోవాలని ప్రభుత్వ పెద్దలు, మంత్రి వివేకే అనేక కుట్రలు చేశారు. చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నిక సందర్భంగా మంత్రి ఆదేశాల మేరకు భారీగా పోలీసులను మోహరించి, కౌన్సిల్ ఎన్నికల హాల్‌కు వెళ్లకుండా అడుగడుగునా అడ్డుకున్నారు.
బీఆర్ఎస్ నాయకులపై లాఠీచార్జి చేశారు. కాంగ్రెస్ రాళ్ల దాడిచేస్తే వారిని వదిలేసి బీఆర్ఎస్ నాయకులు, చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, ఎన్నికల ఇన్‌చార్జీగా వచ్చిన ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మితో పాటు 25 మందిపై అక్రమ కేసులు బనాయించారు. ఆపై బాల్క సుమన్‌ను 16 రోజులు ఆదిలాబాద్ జైలుకు పంపారు. ఆపై జిల్లా కోర్టు బెయిల్ ఇవ్వగా విడుదల అయ్యారు. గెలిచిన కౌన్సిలర్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను కలిశారు. హైకోర్టుకు వెళ్లారు. ఈ నేపథ్యంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఏప్రిల్ 4న చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నిక నిర్వహించారు.
క్యాతనపల్లిలో జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) చంద్రయ్య, ఎన్నికల అధికారి నేతృత్వంలో శనివారం చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ ఎన్నిక జరిగింది. కౌన్సిల్ హాల్‌కు బీఆర్ఎస్, సీపీఐకి చెందిన కౌన్సిలర్లు 14 మంది మాత్రమే హాజరయ్యారని అదనపు కలెక్టర్ తెలియజేశారు. మొత్తం 22 మంది కౌన్సిలర్లకుగాను కాంగ్రెస్ కౌన్సిలర్లు ఏడుగురు, ఒకరు ఇండిపెండెంట్, ఇద్దరు ఎక్స్ఆఫీషియో సభ్యులు మంత్రి వివేక్, ఎంపీ వంశీకృష్ణ ఎన్నికల కార్యాలయానికి హాజరు కాలేదని తెలిపారు.
మున్సిపాలిటీ ఎన్నికల చట్టం ప్రకారం మొత్తం సభ్యులలో సగానికంటే ఎక్కువ ఉంటే ఎన్నికలు నిర్వహించుకోవచ్చు అనే నిబంధనల మేరకు బీఆర్ఎస్ చెందిన 10 కౌన్సిలర్లు, సీపీఐ పార్టీకి చెందిన నలుగురు కౌన్సిలర్లు వారి పార్టీలతో విప్ జారీ చేసిన బీఫామ్స్‌ను ఎన్నిల కార్యాలయంలో అందజేశారని, ఈ మేరకు 12 మంది కోరమ్ ఉండాలని, దానికంటే ఇద్దరు ఎక్కువగా ఉన్నందున బీఆర్ఎస్ పార్టీ 17వ వార్డు కౌన్సిలర్ గొడిసెల సంధ్యారాణి చైర్ పర్సన్‌గా, సీపీఐ పార్టీ 22వ వార్డు కౌన్సిలర్ మిట్టపల్లి సరిత వైస్ చైర్ పర్సన్‌గా ఏక్రగ్రీవంగా ఏన్నుకోవడం జరిగింది.
ఈ మేరకు చైర్ పర్సన్‌గా గొడిసెల సంధ్యారాణి, వైస్ చైర్ పర్సన్‌గా మిట్టపల్లి సరితతో ప్రమాణ స్వీకారం చేయించి, ఎన్నికల ధ్రువీకరణ పత్రాలు అందించామని మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిల నిర్వహణ అధికారి, జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) చంద్రయ్య తెలిపారు. ఆయన మాట్లాడుతూ చైర్ పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసు శాఖకు, ప్రజలకు, వివిధ పార్టీల నాయకులకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియచేశారు. ఎన్నిల అబ్జర్వర్‌గా బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్, మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్ పాల్గొన్నారు.
క్యాతనపల్లి మున్సిపాలిటీ చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ ఎన్నిక శనివారం ప్రశాంతంగా ముగియడంతో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే బాల్క సుమన్ స్వగృ హం వద్ద బీఆర్ఎస్ శ్రేణులు పటాకులు కాల్చి విజయోత్సవ సంబురాలు నిర్వహించారు. అనంతరం క్యాతనపల్లి మున్సిపాలిటీ చైర్ పర్సన్‌గా ఎన్నికైన బీఆర్ఎస్ అభ్యర్థి గొడిసెల సంధ్యారాణికి, వైస్ చైర్ పర్సన్‌గా ఎన్నికైన సీపీఐ పార్టీ అభ్యర్థి మిట్టపల్లి సరితకు, చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికల ఇన్చార్జిగా వచ్చిన కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, చెన్నూరు మాజీ ఎమ్మెల్యే,విప్, మంచిర్యాల జిల్లా అధ్యక్షులు బాల్క సుమన్ శాలువాలు కప్పి ఘ నంగా సన్మానించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గెలిచిన కౌన్సిలర్లు బేషజాలకు పోకుండా మున్సిపాలిటీ అభివృద్ధికి కృషిచేయాలని సూచించారు. రాబోయే కాలంలో కూడా బీఆర్ఎస్, సీపీఐ పార్టీ ఐకమత్యం ఇలాగే కొనసాగుతుందని బాల్క సుమన్ తెలిపారు. ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, కోవ లక్ష్మి, మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, ఏఐటీయూసీ రా ష్ట్ర అధ్యక్షుడు సీతారామయ్య, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేన శంకర్, సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, కరీంనగర్ కార్పొరేషన్ మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ పాల్గొన్నారు.