బెల్లంపల్లి, అక్టోబర్ 31 : బెల్లంపల్లి నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి అమరాజుల శ్రీదేవి టికెట్‌ను రద్దు చేయాలని, లేకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, నియోజకవర్గ ఇన్చార్జి కొయ్యల ఏమాజీ హెచ్చరించారు. పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద మంగళవారం బీజేపీ శ్రేణులతో రాస్తారోకో నిర్వహించారు. అంతకు ముందు పార్టీ కార్యాలయం నుంచి పాత బస్టాండ్ వరకు ర్యాలీ తీశారు. రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు బొల్లెడ కేశవరెడ్డి, సీనియర్ నాయకులు అజ్మీరా శ్రీనివాస్, సత్యనారాయణ రెడ్డి, దూది ప్రకాశ్‌లతో కలిసి ఏమాజీ మాట్లాడారు. ఎనిమిదేళ్లుగా పార్టీ అభివృద్ధి కోసం పనిచేస్తున్న ఏమాజీకి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా ఇటీవల పార్టీలో చేరిన శ్రీదేవికి టికెట్ ఇస్తున్నట్లు ప్రకటించడం శోచనీయమన్నారు. ఏ ప్రాతిపదికన టికెట్ కేటాయించారో అధిష్టానం సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. నాయకులు ప్రభాకర్, శ్రావణ్‌కుమార్, నర్సింగ్, సత్యనారాయణ, బియ్యాల గట్టయ్య, సుభాష్ అజ్మీరా, కోలా ప్రవీణ్‌కుమార్, కలాలికృష్ణ, బ్రహ్మానందం, ప్రభాకర్, కోట రాజు, వంశీ, రామయ్య పాల్గొన్నారు.