ఆదిలాబాద్, జూన్ 4(నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో బీజేపీ విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి గొడం నగేశ్ 90,652 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. లోక్‌సభ నియోజకవర్గానికి చెందిన ఓట్ల లెక్కింపు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని టీటీడీసీలో ఆదిలాబాద్, బోథ్.. పాలిటెక్నిక్ కళాశాలలో నిర్మల్, మథోల్, ఖానాపూర్.. సోషల్ వెల్ఫేర్ స్కూల్లో సిర్పూర్, ఆసిఫాబాద్ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. రిటర్నింగ్ అధికారితోపాటు పరిశీలకుల సమక్షంలో స్ట్రాంగ్ రూంలను తెరిచి కౌంటింగ్ ప్రారంభించారు. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించారు. తర్వాత ఈవీఎంలలో పోలైన్ ఓట్లను కౌంట్ చేశారు. మొదటి రౌండ్ నుంచి బీజేపీ అభ్యర్థి గొడం నగేశ్ ఆధిక్యత కనపబరుస్తూ వచ్చారు. 23 రౌండ్ల ఓట్ల లెక్కింపు కొనసాగగా చివరి రౌండ్ ముగిసే సరికి నగేశ్‌కు 5,68,168 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణకు 4,77,516 ఓట్లు వచ్చాయి. పోస్టల్ బ్యాలెట్‌లోనూ బీజేపీ ఆధిక్యత ప్రదర్శించింది. గొడం నగేశ్‌కు 9,232 ఓట్లు రాగా.. ఆత్రం సుగుణకు 5,183 ఓట్లు వచ్చాయి. పార్లమెంట్ నియోజకవర్గంలో ఏడు అసెంబ్లీ స్థానాలు ఉండగా.. ఆరు నియోజకవర్గాల్లో బీజేపీకి ఆధిక్యత లభించింది. ఆసిఫాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి సుగుణకు మెజార్టీ వచ్చింది.
మొదటి రౌండ్ నుంచి ఆధిక్యత
విజయం సాధించిన బీజేపీ అభ్యర్థి మొదటి రౌండ్ నుంచి ఆధిక్యత లభించింది. మొత్తం 23 రౌండ్లకు ప్రతి రౌండ్లో బీజేపీ ముందంజలో నిలిచింది. మొదటి రౌండ్లో బీజేపీకి 8806 ఓట్లు, రెండో రౌండ్లో 20,326, మూడో రౌండ్లో 27,657, నాలుగో రౌండ్లో 31,965, ఐదో రౌండ్లో 32,794, ఆరో రౌండ్లో 34,846, ఏడో రౌండ్లో 37,649, ఎనిమిదో రౌండ్లో 46,118, తొమ్మిదో రౌండ్లో 48,385, పదో రౌండ్లో 50,983, పదకొండో రౌండ్లో 50,913, పన్నెండో రౌండ్లో 53,543, పదమూడో రౌండ్లో 57,290, పద్నాలుగో రౌండ్లో 57,029, పదిహెనో రౌండ్లో 62,470, పదహారో రౌండ్లో 62,427, పదిహేడో రౌండ్లో 62,366, పద్దెనిమిదో రౌండ్లో 68,134, పంతోమ్మిదో రౌండ్లో 74,790, ఇరవయ్యో రౌండ్లో 78,318, ఇరువై ఒకటో రౌండ్లో 81,994, ఇరువై రెండో రౌండ్లో 85,447, ఇరువై మూడో రౌండ్లో 86,883 ఓట్ల అధిక్యత లభించింది. పోస్టల్ ఓట్లు 4049 కలుపుకుని చివరి రౌండ్ ముగిసే సరికి బీజేపీ అభ్యర్థి గొడం నగేశ్ 90,652 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. విజయం సాధించిన నగేశ్‌కు రిటర్నింగ్ అధికారి రాజర్షి షా ధ్రువీకరణ పత్రం అందజేశారు. బీజేపీ విజయంపై ఆ పార్టీ శ్రేణులు సంబురాలు చేసుకున్నాయి.
కౌంటింగ్ ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్
ఆదిలాబాద్ జిల్లాలోని సంజయ్‌గాంధీ పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహించిన నిర్మల్, ఖానాపూర్, ముథోల్ నియోజకవర్గాల ఓట్ల కౌంటింగ్ ఏర్పాట్లను మంగళవారం కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సౌకర్యాలు, భద్రతను పరిశీలించా రు. అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించా రు. ఈయన వెంట పలువురు అధికారులు ఉన్నారు.
సమస్యల పరిష్కారానికి కృషి
ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎంపీగా విజయం సాధించిన గొడం నగేశ్ తెలిపారు. ఇందుకు పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేల సహకారం తీసుకుంటానన్నారు. సమస్యలపై పూర్తి అవగాహన ఉందని, రైల్వే పనులు, విద్య, ఆరోగ్యంతోపాటు కేంద్రం పరిధిలో ఉన్న పనులను పూర్తి చేస్తానని, ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తానని హామీ ఇచ్చారు.
– గొడం నగేశ్, ఎంపీ, బీజేపీ.