తాండూర్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( Revanth Reddy ) జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో ఆపరేషన్ సింధూర్ ( Operation Sindoor )పై, దేశ సైనికులపై చేసిన వ్యాఖ్యలు సైనికులను అవమానించడమేనని బీజేపీ( BJP ) నాయకులు ఆరోపించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు తాండూరు మండల కేంద్రంలోని ఐబీ సెంటర్లో జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ సైనికులు తమ కుటుంబాలను వదిలి రాత్రనకా, పగలనకా దేశానికి సేవ చేస్తా ఉంటే రేవంత్ రెడ్డి వారి సేవలను గుర్తించకపోగా వారిని అవమానిస్తూ మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. వెంటనే దేశ సైనికులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. భారత సైనికులు ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ కు తగిన బుద్ధి చెప్పిన విషయం ముఖ్యమంత్రికి తెలియదా అని అన్నారు
. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో ఓట్లు వేస్తేనే ప్రభుత్వ పథకాలు కొనసాగుతాయని మాట్లాడటం కాంగ్రెస్ పార్టీకి ఓటమికి నిదర్శనమని అన్నారు. ఆరు గ్యారంటీలు అమలు చేయడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందని అన్నారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు దూడపాక భరత్ కుమార్, జిల్లా కార్యదర్శి రామగౌని మహీధర్ గౌడ్, జిల్లా అధికార ప్రతినిధి చిలుముల శ్రీకృష్ణదేవరాయలు, సీనియర్ నాయకులు పులగం తిరుపతి, జిల్లా కార్యవర్గ సభ్యులు సిద్ధం మల్లేష్, మండల ప్రధాన కార్యదర్శులు పుట్ట కుమార్, మామిడి విగ్నేష్, మండల ఉపాధ్యక్షులు రేవెల్లి శ్రీనివాస్, మండల కార్యదర్శి గాదే రాజేశం, మండల నాయకులు ఆవుల చందు, సోషల్ మీడియా కన్వీనర్ శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.