నెన్నెల, ఫిబ్రవరి 18 : నెల రోజుల పాటు బెల్లంపల్లి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో సంచరించిన పెద్దపులి ప్రస్తుతం నెన్నెల మండలంలోని అడవుల్లోకి అడుగు పెట్టింది. ప్రస్తుతం పొట్యాల, చిత్తపూర్ దుబ్బపల్లి ప్రాంతాల్లో అది సంచరిస్తుండగా, ఆ జోన్లో వేటగాళ్లు అడవి జంతువులను వేటాడుతుంటారు. రంగపేట సెంట్రల్ నర్సరీ నుంచి పొట్యాల అటవీ ప్రాంతాల్లో కొన్నేళ్లుగా పెద్ద పులులు సంచరిస్తూనే ఉన్నాయి. ఈ ప్రాంతంలో అడవి జంతువుల వేటగాళ్లు ఉన్నారు. కరెంట్ తీగలు ఏర్పాటు వేసి జంతువులను వేటాడుతుంటారు.
ఇదే రంగపేట సమీపంలో మూడేళ్ల క్రితం ఓ పెద్దపులి వేటగాళ్ల ఉచ్చుకు బలైంది. అది చనిపోయిన విషయం రెండేళ్ల తర్వాత బయటపడడంతో వేటగాళ్లను పట్టుకొని జైలుకు పంపారు. ప్రస్తుతం పులి సంచరిస్తున్న అడవిలో గతేడాది వేటగాళ్లు అమర్చిన కరెంటు తీగలకు రెండు ఎడ్లు కూడా మృత్యువాతపడ్డాయి. దుబ్బపల్లిలో ఓ వేటగాడు కూడా తీగలు తాకి చనిపోయాడు. ఈ నేపథ్యంలో వేటగాళ్ల వల్ల పులికి ఎలాంటి హాని ఉంటుందోనన్న భయం నెలకొంది. నాలుగు రేంజ్ల అధికారులు, సిబ్బంది పులి కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు.