మంచిర్యాల, మే 20(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మంచిర్యాల, ఆసిఫాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల నుంచి చెన్నూర్ మీదుగా కాళేశ్వరం వెళ్లి సరస్వతీ పుష్కర స్నానం చేయాలనుకుంటున్నారా? అయితే మీరు చెన్నూర్ ఫారెస్ట్ టోల్గేట్ల వద్ద పోనూ రూ.50, రానూ రూ.50 చెల్లించాలి. ఈ పైసలు ముడితేనే మీరు పుష్కర స్నానం చేసి పునీతులు కాగలరు. లేని పక్షంలో ఇబ్బంది పడక తప్పదు.
సరస్వతీ పుష్కరాలను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. పుష్కరస్నానం కోసమని కాళేశ్వరానికి వాహనాల్లో వచ్చే భక్తుల నుంచి డబ్బులు వసూలు చేయవద్దని భూపాలపల్లి కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కానీ.. దానికి విరుద్ధంగా మంచిర్యాల జిల్లా చెన్నూర్ అటవీశాఖ అధికారులు పుష్కర స్నానానికి వచ్చే భక్తులే టార్గెట్‌గా చెన్నూర్, పారుపల్లిలో రెండు ఫారెస్ట్ చెక్‌పోస్టులను మొదలు పెట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సరస్వతీ పుష్కరాలకు వెళ్లే భక్తుల గురించి ఆలోచించకుండా స్థానిక ఎమ్మెల్యే వివేక్ ఈ టోల్గేట్లను ప్రారంభించడంపై స్థానికులు, భక్తులు మండిపడుతున్నారు. రెండు రోజులుగా చెన్నూర్ మీదుగా కాళేశ్వరం వెళ్లే వాహనదారుల నుంచి టోల్ వసూలు చేస్తున్నారు. సదుపాయాలు లేకుండా చెక్‌పోస్టులు పెట్టి టోల్ వసూలు చేస్తుండడంతో పుష్కరసాన్నానికి వెళ్లే భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. చెక్‌పోస్టుల దగ్గర రోడ్డు వెడల్పు చేయలేదు. ఉన్న రోడ్డుపైనే డ్రమ్ములు పెట్టి ఇరుకుగా చేశారు. దీంతో టోల్గేట్ల సమీపంలో నిత్యం ట్రాఫిక్ జామ్ ఏర్పడి భక్తులు ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. ఇన్ని రోజులు లేనిది పుష్కరాల సమయంలోనే హడావుడిగా టోల్గేట్లను ప్రారంభించడం విమర్శలకు తావిస్తున్నది.
నిజామాబాద్-జగ్దల్పూర్ జాతీయర హదారి-63పై మంచిర్యాల జిల్లా చెన్నూర్‌లో అటవీశాఖ టోల్గేట్లు ఏర్పాటు చేయడాన్ని స్థానికులు ముందు నుంచి వ్యతిరేకిస్తున్నారు. హరితరుసుం పేరిట టోల్గేట్లు పెట్టి, డబ్బులు వసూలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. నేషనల్ హైవే పై ఫారెస్ట్ అధికారులు టోల్గేట్లు ఏర్పాటు చేయడం పూర్తిగా చట్టవిరుద్ధమని వాదిస్తున్నారు. అధికారులు మాత్రం ఈ ప్రాంతం ప్రాణహిత(కృష్ణజింకల) అభయారణ్యం పరిధిలోకి వస్తుందని అందుకే హరితరుసం వసూలు చేసేందుకు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయని చెప్తున్నారు.
ఈ విషయంలో వైల్డ్‌లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్‌ను అతిక్రమిస్తూ, అటవీ శాఖ తన పరిధి దాటి జాతీయ రహదారిపై రుసుం వసూళ్లకు తెరలేపిందని నిపుణులు అంటున్నారు. చట్టంలో ఉన్నది ఒకటైతే అధికారులు చేసేది మరోలా ఉందంటూ మండిపడుతున్నారు. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లోనే ప్రారంభం కావాల్సిన ఈ టోల్గేట్లు స్థానిక వ్యతిరేకత నేపథ్యంలో వాయిదా పడ్డాయి. చెన్నూర్, కోటపల్లి మండలాలకు చెందిన వాహనదారుల నుంచి టోల్ వసూలు చేయమంటూ ఫారెస్ట్ అధికారులు చెప్పారు. ప్రస్తుతం చెన్నూర్, కోటపల్లి వాహనదారుల నుంచి కూడా టోల్ వసూలు చేయడం చర్చనీయాంశంగా మారింది. కారుకు రూ.50, ఆటోకు రూ.30, పెద్ద వాహనాలైతే రూ.200 టోల్ కట్ చేస్తున్నారంటూ స్థానికులు వాపోతున్నారు. ఫారెస్ట్ అధికారులు పుష్కరాల సమయంలో హడావుడిగా టోల్గేట్లను ప్రారంభించడంపై మండిపడుతున్నారు.
చెన్నూర్‌లో ఇప్పటికే ఫారెస్ట్ అధికారులు కిష్టంపేట, పారుపల్లిలో రెండు చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. చెన్నూర్‌లోనే నేషనల్ హైవే అథారిటీ ఆధ్వర్యంలో మరో టోల్గేట్ సిద్ధం అవుతుంది. సరిగ్గా పారుపల్లి, కిష్టంపేటకు మధ్యలో చెన్నూర్ సమీపంలోని హైవేపై టోల్గేట్ పెడుతున్నారు. అంటే ఇకపై ఈ మార్గంలో వచ్చే వాహనానికి అటు నేషనల్ హైవే వారు, అటు ఫారెస్ట్ వాళ్లు రెండు టోల్‌కు వసూలు చేసేందుకు సిద్ధం అవుతున్నారు. దీనిపై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
ఒకే రోడ్డుపై పది కిలోమీటర్లు కూడా దాటకుండానే రెండు టోల్లు కట్టాలని ఏ చట్టంలో ఉందో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. జాతీయ రహదారిపై ఫారెస్టు టోల్ గేట్ పూర్తిగా చట్టవిరుద్ధం అంటున్నారు. అటు పారుపెల్లి నుంచి కిష్టంపేట దాకా అసలు ఫారెస్ట్ అనేది లేదు. అలాంటి చోటే టోల్గేట్లు పెట్టడం వెనుక మతలబేంటో చెప్పాలంటున్నారు. వైల్డ్‌లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్-1972 సెక్షన్ 28 (1) (డీ) అండ్ (2) అనుసరించి చీఫ్ట్ వైల్డ్ లైఫ్ వార్డెన్‌కు అభయారణ్యం ప్రాంతంలో హరిత రుసం వసూలు చేసే అధికారం ఉందని అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు.
ఒక్కసారి యాక్ట్‌లోని 28 సెక్షన్‌ను నిశితంగా పరిశీలిస్తే.. 28 (1) (ఏ) వన్యప్రాణుల పరిశోధన-అధ్యయనం, 28 (1) (బీ) ఫొటోగ్రఫీ, 28(1) (సీ) శాస్త్రీయ పరిశోధన, 28(1) (డీ) టూరిజం గురించి చెప్తున్నాయి. ఇందులోనే సెక్షన్ 28 (2) అభయారణ్యంలోకి ఎవరైనా ప్రవేశించడానికి లేదా నివసించడానికి అనుమతించేందుకు రుసుం వసూలు చేసే అధికారాన్ని కల్పిస్తున్నది. దీని ప్రకారమే చెన్నూర్‌లోనూ హరితరుసం వసూలు చేస్తున్నామని అటవీశాఖ అధికారులు చెప్తున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. యాక్ట్‌ను అనుసరించి అభయారణ్యం పరిధి లోపలి ప్రాంతాల్లోనే ఇలా రుసుం వసూలు చేసే అధికారం అటవీ శాఖ అధికారులకు ఉంది.
ప్రస్తుతం పారుపల్లి, కిష్టంపేటలో ఫారెస్టు అధికారులు ఏర్పాటు చేసిన టోల్గేట్లు పూర్తిగా జాతీయ రహదారి-63 పరిధిలోకి వస్తాయి. ఈ నేషనల్ హైవే అనేది అభ్యయారణ్యం పరిధిలోకి రాదు. అంటే ఇక్కడ రుసుం వసూలు చేసే అధికారులు ఫారెస్టు వాళ్లకు లేదనేది నిపుణుల అభిప్రాయం. ఇవేం పట్టించుకోకుండా టోల్గేట్లు ఏర్పాటు చేయడం, సరస్వతీ పుష్కర స్నానానికి వచ్చే వాహనదారుల నుంచి రుసుం వసూలు చేయడం చర్చనీయాంశంగా మారింది.
సరస్వతీ పుష్కరాలకు వచ్చే భక్తుల నుంచి గ్రీన్‌ట్యాక్స్ పేరిట టోల్ వసూలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. గతంలోనే ఇక్కడ టోల్గేట్లు ఎందుకు పెడుతున్నారని అడిగినప్పుడు కేవలం ఇసుక తీసుకెళ్లే లారీలకు మాత్రమే వసూలు చేస్తాం అన్నారు. స్థానికుల నుంచి తీసుకోమని చెప్పారు. ఇప్పుడు కావాలని ఫాస్ట్‌ట్యాగ్ పెట్టి వసూలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. చెన్నూర్, కోటపల్లి వారికి కూడా టోల్ కట్ చేయడం సరికాదు. ముఖ్యంగా పుష్కరాల కోసం కాళేశ్వరం వచ్చే భక్తుల వాహనాల నుంచి ట్యాక్స్ తీసుకోవద్దు. భూపాలపల్లి జిల్లాలోనే తీసుకోవడం లేదు. అలాంటప్పుడు మన దగ్గర ఎలా తీసుకుంటారు. ఆ రోడ్డు సెంట్రల్ గవర్నమెంట్‌ది. రాష్ట్ర ఫారెస్ట్ వాళ్లకు అక్కడ ఏం పని. నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన టోల్‌గేట్‌ను శాశ్వతంగా తొలగించాలని డిమాండ్ చేస్తున్నాం. అధికారులు స్పందించని పక్షంలో ప్రత్యేక కార్యచరణతో ముందుకు వెళ్తాం.
– వెంకటేశ్వర్‌గౌడ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు
మాది కోటపల్లి మండలంలోని కొల్లూర్ గ్రామం. స్థానికులకు టోల్ తీసుకోమని చెప్పారు. నిన్న నేను చెన్నూర్‌కు 10 కిలోమీటర్లు దూరం పోతే రూ.50 టోల్ కట్ చేసుకున్నారు. ముందు స్థానికులకు ఇచ్చిన హామీ ప్రకారం ఆర్టీవో కార్యాలయం నుంచి డేటా సేకరించి, స్థానికులకు మినహాయింపు ఇవ్వాలి. అదేం చేయకుండానే హడావుడిగా రెండు రోజుల క్రితం టోల్‌గేట్‌ను ప్రారంభించారు. రోజుకు ఐదారు సార్లు చెన్నూర్‌కు పోతాం. పోయిన ప్రతి సారి రూ.50 కట్టడం అంటే ఎక్కడికి పోయేది. స్థానికులకు కచ్చితంగా టోల్గేట్ నుంచి మినహాయింపు ఇవ్వాలి. ఫారెస్ట్ అధికారులు ఇచ్చిన మాటకు కట్టుపడాలి.
– జంగా రవిచంద్రన్‌రెడ్డి, కొల్లూర్.