ఎదులాపురం, నవంబర్ 17 : విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు అంకిత భావంతో విధులు నిర్వర్తించాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న సూచించారు. తద్వారా విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ అందించిన వారవుతాని పేర్కొన్నారు. ‘మన బస్తీ-మన బడి’ కింద జిల్లా కేంద్రంలోని బొక్కలగూడ, భుక్తాపూర్, విద్యానగర్, మహాలక్ష్మివాడ, రాంనగర్ పాఠశాలల్లో అభివృద్ధి పనులకు గురువారం మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్‌తో కలిసి ఆయన భూమి పూజ చేశారు. ముందుగా పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల-2లో అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ క్రమంలో పాఠశాలలో విద్యార్థుల హాజరు శాతం తక్కువగా ఉండడాన్ని గమనించి, తీవ్ర ఆసహనం వ్యక్తం చేశారు. జిల్లా విద్యాశాఖ కార్యాలయం పక్కనే ఉన్న పాఠశాలలో ఇలా ఉండడం ఎంత మేరకు సమంజసమని డీఈవోను ప్రశ్నించారు. ప్రిన్సిపాల్‌తో అన్ని తరగతుల హాజరు రిజిస్టర్లను తెప్పించి, విద్యార్థుల సంఖ్యను పరిశీలించారు.
ప్రతి రోజూ దాదాపు 80 శాతం విద్యార్థులు పాఠశాలకు గైర్హాజరుకావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో విద్యాశాఖ అధికారులు, పాఠశాల ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని డీఈవోకు సూచించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న నిరుపేద విద్యార్థులకు అత్యుత్తమ బోధన అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టిందన్నారు. క్షేత్రస్థాయిలో వాటిని అమలు చేసి, ఉత్తమ ఫలితాలు రాబట్టాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. విద్యార్థులు పాఠశాలలకు హాజరు కాకపోతే వారి ఇండ్లకు వెళ్లి తల్లిదండ్రులతో చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయంలో స్థానిక కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధుల సహకారం తీసుకోవాలన్నారు. విద్యార్థులు క్రమశిక్షణ అలవర్చి వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీ, మున్సిపల్ కమిషనర్ శైలజ, పట్టణాధ్యక్షుడు అజయ్, మహిళా అధ్యక్షకార్యదర్శులు స్వరూపరాణి, బోడగం మమత, బీసీ పట్టణాధ్యక్షుడు దాసరి రమేశ్, మైనార్టీ నాయకులు సలీం పాషా తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థికి అభినందనలు..
బేల, నవంబర్ 17 : జైనథ్ మండలం కూర ఉన్నత పాఠశాల విద్యార్థి అప్పాస్ రాహుల్ జాతీయస్థాయి సైన్స్‌ఫెయిర్‌కు ఎంపికవగా, ఆయనను ఎమ్మెల్యే అభినందించారు. 22-27వ తేదీ వరకు అస్సాం రాష్ట్రంలోని గువాహటిలో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి సైన్స్‌ఫెయిర్‌లో పసి పిల్లల కోసం తయారు చేసిన కూలర్‌ను రాహుల్ ప్రదర్శించనున్నాడు. గైడ్ టీచర్ నాగరాజు పాల్గొననున్నాడు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విద్యార్థికి ప్రోత్సాహకంగా రూ.5 వేలు అందజేశారు. ఎంపీపీ మార్శెట్టి గోవర్ధన్, జడ్పీటీసీ తుమ్మల వెంకట్‌రెడ్డి, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు ఎస్ లింగారెడ్డి, సర్పంచ్ అడ్డి లతా వెంకట్‌రెడ్డి, హెచ్ఎం అశోక్, సైన్స్ అధికారులు రఘురమణ, భాస్కర్, గైడ్ టీచర్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
శ్రీ బాజీరావ్ బాబా పుణ్యతిథి..
జైనథ్ మండలంలోని మాండగూడలో శ్రీ బా జీరావ్బాబా పుణ్యతిథి కార్యక్రమంలో ఎమ్మెల్యే జోగు రామన్న పాల్గొన్నారు. బాబా పల్లకీ ఊరేగింపులో పాల్గొన్నారు. పల్లకీని మోశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ భక్తిమార్గంలో నడువాలని సూచించారు. బాజీరావ్బాబా సప్తాహతో ఎన్నో గ్రామాల్లో భక్తిభావన పెరిగిందన్నారు. వేల సంఖ్యలో భక్తులు భక్తిమార్గాన్ని అనుసరిస్తున్నారని పేర్కొన్నారు. డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, నాయకులు చంద్రయ్య, ప్రభాకర్, మహేందర్రావ్, సురేందర్‌రెడ్డి, మల్లారెడ్డి, భక్తులు పాల్గొన్నారు.