మందమర్రి/శ్రీరాంపూర్/కౌటాల, ఆగస్టు 11 : ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన వైద్య సేవలందించాలని డీహెచ్(డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్) అధికారి రవీంద్ర నాయక్ వైద్య సిబ్బందికి సూచించారు. ఆదివారం మందమర్రిలోని దీపక్‌నగర్ కాలనీగల ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్యాధికారి డాక్టర్ హరీశ్రాజుతో కలసి తనిఖీ చేశారు. రికార్డులు, గర్భిణుల కోసం ఏర్పాటు చేసిన వెయిటింగ్ గది, ఫార్మసీ, వ్యాక్సిన్లను పరిశీలించారు.
సౌకర్యాలపై ఆరా తీశారు. వసతులు, రోగులకు అందిస్తున్న సేవల గురించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించవద్దని సూచించారు. కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్ అనిత, డాక్టర్ సీతారాం, డాక్టర్ ఫయాజ్, మాస్ మీడియా అధికారి వెంకటేశ్వర్లు, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మానస, డాక్టర్ శివప్రతాప్, డీపీవో ప్రశాంతి, పబ్లిక్ హెల్త్ సూపరింటెండెంట్ శ్రీకాంత్ పాల్గొన్నారు.
నస్పూర్ మున్సిపాలిటీ యూపీహెచ్‌సీని ఆదివారం వైద్య, ఆరోగ్య శాఖ రాష్ట్ర డైరెక్టర్ బీ రవీందర్ నాయక్ సందర్శించారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ హరీశ్‌రాజ్, డాక్టర్లు సీతారామరాజు, అనిత, ఫయాజ్, సుచరిత, శివ, ప్రతాప్, మానస స్వాగతం పలికారు. అనంతరం డైరెక్టర్ దవాఖాన అన్ని విభాగాల సేవలను పరిశీలించారు.
అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచుకోవాలని కోరారు. ఎలాంటి సమస్యలున్నా డీఎంహెచ్‌వో దృష్టికి తీసుకెళ్లాలని చెప్పారు. అనంతరం ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు సమస్యలపై వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో అధికారులు విశ్వేశ్వర్‌రెడ్డి, బుక్క వెంకటేశ్వర్, జిల్లా మాస్ మీడియా అధికారులు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.
కౌటాలలో..
కౌటాల మండల కేంద్రంలోని పీహెచ్‌సీని రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ రవీంద్ర నాయక్ శనివారం రాత్రి పరిశీలించారు. ఆపరేషన్, ఓపీ, ఇన్‌పేషెంట్ రూంలు, ఫార్మసీ, ల్యాబ్ ఇతర గదులను పరిశీలించారు. ఈ నెల 9న ‘నమస్తే తెలంగాణ’లో ‘జాతీయ స్థాయి దవాఖానలో వైద్యుల్లేరు’ శీర్షికన కథనం ప్రచురితమవ్వగా, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సీరియస్‌గా తీసుకున్నట్లు ఆయన తెలిపారు. దీనికి గల కారణాలను తెలుసుకుని ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇవ్వడంతో హెల్త్ డైరెక్టర్ రవీంద్ర నాయక్ హైదరాబాదు నుంచి శనివారం రాత్రి కౌటాలకు చేరుకున్నారు.