ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించి ఒకేసారి మూడు నెలల బియ్యం పంపిణీ చేస్తామని ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించినా, క్షేత్రస్థాయిలో మాత్రం అందుకు తగిన ఏర్పాట్లు చేయకపోవడంతో పౌరసరఫరాల శాఖ తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బియ్యం పంపిణీ ప్రారంభమై దాదాపు 22 రోజులైనా చాలా చోట్ల ఇంకా అందకపోవడంతో షాపుల వద్ద లబ్ధిదారులు పడిగాపులు కాయాల్సి వస్తున్నది. ప్రణాళిక లేకుండా ఒకేసారి పంపిణీ చేపట్టడం, అందుకు తగ్గట్లుగా రేషన్ దుకాణాలకు సకాలంలో బియ్యాన్ని సరఫరా చేయకపోవడంతో క్షేత్రస్థాయిలో గందరగోళ పరిస్థితి నెలకొన్నది. పనులన్నీ పక్కనబెట్టి ఉదయం నుంచి సాయంత్రం వరకు రేషన్ దుకాణాల ఎదుట నిరీక్షిస్తున్న లబ్ధిదారులకు స్టాక్ లేదు అనే సమాధానమే ఎదురవుతున్నది. ఒకవేళ స్టాక్ వచ్చినా, రెండు, మూడు రోజుల్లోనే బియ్యం ఖాళీ కావడంతో కార్డుదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
నిర్మల్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ) : నిర్మల్ జిల్లాలో మొత్తం 412 రేషన్ దుకాణాలున్నాయి. వీటికి నిర్మల్, ఖానాపూర్, భైంసా, ముథోల్‌లోని నాలుగు ఎంఎల్ఎస్ (మండల్ లెవెల్ స్టాక్) పాయింట్ల నుంచి బియ్యం సరఫరా అవుతుంది. ఆయా స్టాక్ పాయింట్ల పరిధిలోని అన్ని రేషన్ దుకాణాలకు ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో బియ్యం సరఫరా కాలేదని చెబుతున్నారు. 70 శాతం మాత్రమే బియ్యం సరఫరా కావడంతో అటు డీలర్లు, ఇటు లబ్ధిదారులు రోజుల తరబడి నిరీక్షించాల్సి వస్తున్నది. జిల్లాలో 2,49,996 రేషన్ కార్డులున్నాయి. వీటి పరిధిలో 7,74,910 యూనిట్లకు గాను మూడు నెలల కోటా కింద 14,075 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని కేటాయించారు. ఇప్పటి వరకు జిల్లాలోని 4 ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి 412 దుకాణాలకు 11,805 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సరఫరా చేశారు. ఇంకా 2,121 మెట్రిక్ టన్నులు సరఫరా చేయాల్సి ఉన్నది. బియ్యం పంపిణీకి మరో వారం రోజులు మాత్రమే గడువు ఉన్న నేపథ్యంలో లబ్ధిదారులకు పూర్తి స్థాయిలో అందుతాయో? లేదో? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
నిర్మల్, భైంసా ఎంఎల్ఎస్ పాయింట్ల పరిధిలో గల రేషన్ దుకాణాలకు మూడు నెలల బియ్యం కోటా అందడంలో తీవ్ర జాప్యం జరుగుతున్నట్లు తెలుస్తున్నది. నిర్మల్ ఎంఎల్ఎస్ పాయింట్ పరిధిలో మొత్తం 148 రేషన్ దుకాణాలు ఉండగా, మూడు నెలల కోటా కింద ఆయా దుకాణాలకు 5,105 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని కేటాయించారు. ఇప్పటి వరకు ఆయా దుకాణాలకు 3,842 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని మాత్రమే సరఫరా చేశారు. 1,262 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సరఫరా చేయాల్సి ఉన్నది. ఈ నెల 1న రేషన్ బియ్యం పంపిణీ ప్రారంభించగా, ఇప్పటి వరకు నిర్మల్ ఎంఎల్ఎస్ పాయింట్ పరిధిలో 75 శాతం మాత్రమే పంపిణీ పూర్తయింది. వచ్చే వారం రోజుల్లో మిగిలిన 25శాతం పంపిణీ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉన్నది. భైంసా ఎంఎల్ఎస్ పాయింట్ పరిధిలో 114 రేషన్ దుకాణాలు ఉండగా, మూడు నెలల కోటా కింద ఆయా దుకాణాలకు 4,209 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని కేటాయించారు. ఇప్పటి వరకు ఆయా దుకాణాలకు 3,350 మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా జరిగింది. ఇంకా 858 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సరఫరా చేయాల్సి ఉన్నది. ఈ రెండు ఎంఎల్ఎస్ పాయింట్ల పరిధిలోని 262 రేషన్ దుకాణాలకు బియ్యం సరఫరాలో జరుగుతున్న జాప్యం కారణంగా అర్హులైన లబ్ధిదారులకు సకాలంలో బియ్యం అందడం లేదు.
మూడు నెలల కోటాకు సంబంధించి ఈ నెలాఖరుతో గడువు ముగియనుండగా, ఇంకా వారం రోజులు మాత్రమే సమయం మిగిలి ఉంది. ఈ తక్కువ సమయంలో 2,121 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి దుకాణాలకు చేర్చి, కార్డుదారులకు ఏ విధంగా పంపిణీ చేస్తారనేది యంత్రాంగానికే సవాలుగా మారింది. ఏకకాలంలో మూడు నెలల బియ్యం ఇస్తామని చెప్పి ఆచరణలో విఫలం కావడంపై పేదలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు వెంటనే స్పందించి, రవాణా అడ్డంకులను తొలగించి మిగిలిన నిల్వలను వేగంగా రేషన్ దుకాణాలకు తరలించి అర్హులందరికీ పూర్తి స్థాయిలో బియ్యం అందేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.