మంచిర్యాలటౌన్, నవంబర్ 6 : 42 శాతం బీసీ రిజర్వేషన్ అమలు చేయాల్సిందేనని బీసీ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం మంచిర్యాలలోని ఐబీ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహం ఎదుట నల్లబ్యాడ్జీలు ధరించి, మోకాళ్లపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. బీసీ సంఘాల నాయకు లు మాట్లాడుతూ రాష్ట్రంలో బీసీ బిల్లు ప్రవేశపెట్టి తొమ్మిది నెలలు గడుస్తున్నా, ఇంతవరకు గవర్నర్ ఆమోదంకానీ, పార్లమెంటు ఆ మోదం కానీ పొందలేదని అన్నారు.
ముస్లిం ల జనాభాను అడ్డంపెట్టుకుని రాజకీయపార్టీలు కుంటిసాకులు చెబుతున్నాయని మండిపడ్డారు. అగ్రవర్ణాలు 10 శాతం రిజర్వేషన్లను ఆమోదించుకొని, దేశ జనాభాలో అధిక శాతమున్న బీసీలకు మాత్రం అన్యాయం చేస్తున్నారన్నారు. ఇక ఊరుకునేది లేదని, తెలంగాణ ఉద్యమం మాదిరిగానే బీసీ రిజర్వేషన్లకోసం పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ నాయకులు డాక్టర్ నీలకంఠేశ్వర్‌గౌడ్, కందుల శ్రీనివాస్, రాజేశంగౌడ్, శ్రీనివాస్, రమేశ్, లింగన్న, శ్రీనివాస్, రాజారెడ్డి, శంకర్‌గౌడ్, కుమార్, గొల్ల రాజన్న, చందు పాల్గొన్నారు.
42 శాతం బీసీ రిజర్వేషన్ల కోసం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులు చేస్తున్న దీక్షకు మద్దతుగా గురువారం మంచిర్యాలలోని గాంధీ పార్కులో శ్రీభక్త మార్కండేయ పద్మశాలీ సంఘం ఆధ్వర్యంలో దీక్షచేపట్టారు. పలువురు మాట్లాడుతూ 56 శాతానికి పైగా ఉన్న బీసీలకు ఉద్యోగ, విద్యావకాశాల్లో న్యాయం జరగాలంటే 42 శాతం రిజర్వేషన్ల అమలే మార్గమని, ఇది అమలుకాకుండా అగ్రవర్ణాల వారు అడ్డుకోవడం బాధకరమన్నారు. ఈ కార్యక్రమంలో పద్మశాలీ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు గజ్జెల్లి వెంకటయ్య, వేముల అశోక్, చెలిమెల అంజన్న, అంకం సతీశ్ పాల్గొన్నారు.