ప్రపంచమంతా పూలతో దేవుడిని కొలిస్తే, ఆ పూలనే పూజించే అరుదైన సంస్కృతి మనది. తెలంగాణ ప్రాంతంలో ‘బతుకమ్మ’గా పుట్టి, ఖండాంతరాలకు చేరిందీ పండుగ. ఇది ప్రకృతితో మనకున్న సంబంధం. ఇంకా చెప్పాలంటే మన జీవన విధానం. నేటి నుంచి బతుకమ్మ సంబురం ఎంగిలి పూలతో మొదలవుతుండగా, ఇక తొమ్మిది రోజులపాటు ఊరూరూ సందడిగా మారనున్నది. ‘బతుకమ్మ.. బతుకమ్మ ఉయ్యాలో..’ అంటూ సాగే ఆడబిడ్డల ఆటాపాటలతో ఊరూవాడా హోరెత్తనున్నది.
మంచిర్యాల ఏసీసీ, సెప్టెంబర్ 24: మన రాష్ట్ర సంస్కృతీ సంప్రదాయానికి నిలువెత్తుగా నిలిచే ప్రకృతి పూల పండుగ బతుకమ్మ. నేటి ఆదివారం నుంచి ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభయ్యే వేడుకలు తొమ్మిది రోజుల పాటు ఒక్కేసి.. పువ్వేసి చందమామ.. ఒక్కజాము ఆయె చందమామా… అంటు చుట్టూ తిరుగుతూ పాటలను పాడుతూ… చిన్నాపెద్ద తారతమ్యం లేకుండా మహిళల ఆటపాటలతో సందడిగా మారనున్నది. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా అధికారులు, ప్రజాప్రతినిధులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా కేంద్రంలోని విశ్వనాథ ఆలయం, పలు కూడళ్లలో నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. ఆటపాటల అనంతరం బతుకమ్మ నిమజ్జనానికి గోదావరి తీర ప్రాంతం, చెరువులు, కుంటల వద్ద అధికారులు ఏర్పాట్లు చేశారు.
పూల సేకరణలో బిజీ..
బతుకమ్మను పేర్చడానికి అవసరమైన పూలను సేకరించడంలో మహిళలు శనివారం బిజీబిజీగా కనిపించారు. వివిధ గ్రామాల సమీపంలోని చెట్ల మీద తంగెడు పూలు, ఎంగిలిపూలు సేకరించారు. వీటితో పాటు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మార్కెట్లో వ్యాపారులు ఆయా ప్రాంతాల నుంచి తీసుకవచ్చిన తంగెడు, గునుగు, గుమ్మడి, కట్ల, బంతిపూలు, చామంతులు, ఇతర పూలను కొనుగోలు చేశారు.
రోజుకో ప్రత్యేకత
బతుకమ్మ ఉత్సవాల సందర్భంగా మహిళలు రోజుకోరకమైన పిండి వంటను చేసి వెంపలి చెట్టు వద్ద నైవేద్యంగా సమర్పిస్తారు. అనంతరం చేసిన ప్రసాదాలను వేడుకల్లో పాల్గొన్న మహిళలు ఒకరినొకరు ఇస్తినమ్మ వాయినం, పుచ్చుకుంటినమ్మ వాయినం.. అంటూ ప్రసాదాన్ని స్వీకరిస్తారు. ఆదివారం మొదటిరోజు నువ్వులు, నూకలు, బెల్లంతో తయారు చేసిన పులగం నైవేద్యం చేస్తారు. రెండో రోజు అటుకుల బతుకమ్మను బెల్లం, చప్పిడి పప్పు, అటుకులతో రొట్టెల ప్రసాదం, మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ సందర్భంగా ముద్దపప్పు, బెల్లం, పాలతో చేసిన ఫలహారం, నాలుగోరోజు నానబియ్యం బతుకమ్మ ఈ రోజు పాలు, బెల్లం, నానబెట్టిన బియ్యంతో నైవేద్యం తయారు చేస్తారు. ఐదో రోజు అట్ల బతుకమ్మకు బియ్యం నానబెట్టి దంచి తీసిన తరువాత పిండితో తయారుచేసిన అట్ల ప్రసాదం పెడతారు. ఆరో రోజున బతుకమ్మ వేడుకలు నిర్వహించకుండా అరిసెలు ప్రసాదంగా సమర్పిస్తారు. ఏడోరోజు గారెలు, వేపకాయ పరిమాణంలో ఉండే పిండి ముద్దల ప్రసాదంగా వేపకాయల బతుకమ్మగా నిర్వహిస్తారు. ఎనిమిదో రోజు వెన్నెముద్దల బతుకమ్మకు నువ్వులు, బెల్లం, నెయ్యితో తయారుచేసిన వెన్న ముద్దల ఫలహారం, తొమ్మిదో రోజు ఐదురకాల సద్దుల ఫలహారంతో నైవేద్యాన్ని నివేదిస్తారు.
దేవీశరన్నవరాత్రి ఉత్సవాలకు మండపాలు సిద్ధం
దసరా పండుగలో భాగంగా నిర్వహించే దుర్గాదేవీ శరన్నవరాత్రి ఉత్సవాలకు నిర్వాహకులు ఆయా చోట్ల మండపాలను సిద్ధం చేశారు. రేపటి నుంచి సెప్టెంబర్ 5వ తేదీ (దసరారోజు) వరకు ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఇప్పటికే ప్రతిష్ఠించే విగ్రహాలన్నీ సిద్ధంగా ఉన్నాయి.
బతుకమ్మ చీరల సంబురం
ప్రభుత్వం ప్రత్యేకంగా మహిళలకు పండుగ కానుకగా బతుకమ్మ చీరలను అందిస్తున్నది. మంచిర్యాల జిల్లాకు 2,83,909 చీరలు రావడంతో ఎక్కడికక్కడ ప్రజాప్రతినిధులు మహిళలకు చీరలను పంపిణీ చేస్తున్నారు.