మంచిర్యాల, మార్చి 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : క్యాతన్‌పల్లి మున్సిపాలిటీకి ఎప్పుడు ఎన్నికలు నిర్వహించినా చైర్మన్‌గా బీఆర్ఎస్, వైస్ చైర్మన్‌గా సీపీఐ గెలవడం ఖాయమని మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ అన్నారు. ఈ మున్సిపాలిటీలో ఎగిరేది గులా బీ జెండానే అని స్పష్టం చేశారు. క్యాతన్‌పల్లిలో గెలిచిన మా 14 మంది కౌన్సిలర్లు చాలా క్లీయర్‌గా, కాన్ఫిడెంట్‌గా ఉన్నారన్నారు. ఏ రోజు ఎన్నిక పెట్టినా 14 చేతులు మాకు అనుకూలంగా లేస్తాయని, ఇందులో ఎలాంటి సందేహం లేదని చెప్పారు. ఒకవేళ ఇలా కాకుండా.. చేతిలో రాజ్యం ఉంది, పోలీసులు ఉన్నారు, అధికారం ఉందని ప్రజాతీర్పును కాలరాయాలని చూస్తే మరో ప్రజా ఉద్యమానికి సిద్ధమని హెచ్చరించారు. ప్రతిపక్ష పార్టీగా, మాజీ ఎమ్మెల్యేగా ప్రజాస్వామ్యంలో నిరసనలు, పోరాటాలు తప్ప ఏం చేయలేమని, ఇక క్యాతన్‌పల్లి మున్సిపల్ ఎన్నికను ఇక్కడి ప్రజలే తేల్చుకోవాలని విజ్ఞప్తి చేశారు. జైలు నుంచి విడుదలైన సందర్భంగా బుధవారం క్యాతన్‌పల్లిలోని తన నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో బాల్క సుమన్ మాట్లాడారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నియంత పాలన సాగిస్తుంటే, చెన్నూర్ నియోజకవర్గంలో మంత్రి వివేక్ చోటా నియంత పాలన సాగిస్తున్నారన్నారు. న్యాయంగా గెలిచిన ఎన్నికలో పోలీసులు ఈ స్థాయిలో పెట్రేగిపోతే ఏం చేయాలి.. ఇంత అరాచకం, ఇంతలా నియంత పోకడలను ఏమనుకోవాలో ఆలోచించాలన్నారు. ఇలాంటప్పుడు ఎన్నికలకు అర్థం ఏముందని, మీరే డైరెక్ట్ నామినేటెడ్ చేసుకుంటే సరిపోయేదన్నారు. ఇంత జరిగాక కూడా ఈ రోజు క్యాతన్‌పల్లి మున్సిపాలిటీలో మా కౌన్సిలర్ల బంధువులు, సన్నిహితుల ఇండ్లకు వెళ్లి కిడ్నాప్ కేసు పెట్టండి అని పోలీసులు అడుక్కోవడం సిగ్గుచేటు అన్నారు. ఇంత కథ జరిగాక కూడా మళ్లీ క్యాతన్‌పల్లి మున్సిపాలిటీని దక్కించుకోవాలనే ప్రయత్నాలు మొదలుపెట్టారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఈ ప్రాంతంలో ఎన్నికలు ఎందుకు.. మీరే నామినేటెడ్ చేసుకుంటే సరిపోతుందంటూ మండిపడ్డారు. ఇప్పటికైనా ఇలాంటి పిచ్చి చర్యలను పోలీసులు మానుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి ఏం చేసినా చెల్లుతుందన్న భ్రమలో ఉందని, వాళ్ల చేతుల్లో పోలీసులు పావులుగా మారిపోయి, స్థాయిని దిగజార్చుకున్నారన్నారు. మొత్తం పోలీస్ వ్యవస్థను భ్రష్ఠు పట్టిస్తూ.. పోలీసులు అంటేనే ప్రజలు అసహ్యించుకునే పరిస్థితి తీసుకువచ్చారన్నారు. మంచిర్యాల జిల్లాలో డీసీపీ నుంచి ఏసీపీలు, సీఐలు, ఎస్ఐలు, కానిస్టేబుళ్ల దాకా, కలెక్టర్ నుంచి క్యాతన్‌పల్లి మున్సిపల్ ఎన్నిక స్పెషల్ ఆఫీసర్‌గా ఉన్న ఎమ్మార్వో దాకా అధికారులుగా కాకుండా, మంత్రి వివేక్ విశాఖ కంపెనీలో ఎంప్లాయీస్‌గా పని చేస్తున్నారన్నారు. పోలీసులైతే పూర్తిగా తొత్తులుగా మారిపోయి పని చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఇప్పటికైనా తీరు మార్చుకోకపోతే ప్రజాక్షేత్రంలో శిక్ష తప్పదని ఈ సందర్భంగా బాల్కసుమన్ హెచ్చరించారు.
మొన్న మా ఇంటి దగ్గర నన్ను అరెస్టు చేసే సందర్భంలో నిరసన తెలుపుతున్న మా కార్యకర్తలపై లాఠీచార్జి చేశారు. మంచిర్యాల హాస్పిటల్‌కు నన్ను చూసేందుకు వచ్చిన కార్యకర్తలపై, ఆదిలాబాద్ జైలుకు నా కోసం వచ్చిన మా నాయకులపై లాఠీచార్జి చేశారు. డీసీపీ, ఏసీపీలు మా వాళ్లను కొట్టండని ఆదేశాలు ఇచ్చారు. ‘సరే మీరు కొట్టారు.. మేము రిసీవ్ చేసుకుంటాం. సంతోషం బాగా కొడుతున్నారు, మమ్ములను బాగా ఇబ్బందులు పెడుతున్నారు.. అందుకే.. ఐ లవ్ యూ వివేక్..’ అంటూ బాల్కసుమన్ చెప్పారు. ‘నో ప్రాబ్లమ్, కానివ్వు.. ఏదేమైనా అంతిమంగా నేను ఒక్క మాట చెబుతున్నా.. ఏది ఊరికే పోదు’ అన్నారు. అన్నీ ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఇవాళ మీరేందో.. మీమేంటో.. ప్రజలందరికీ తెలుసని చెప్పుకొచ్చారు. మేము ఎలా ప్రవర్తిస్తున్నామో, మీరు ఎలా ప్రవర్తిస్తున్నారో రాష్ట్ర ప్రజలతో పాటు, క్యాతన్పలి ప్రజలు చూస్తున్నారన్నారు. అంతిమంగా ప్రజాస్వామ్యంలో ప్రజలు గొప్పోళ్లు అని గుర్తుంచుకోవాలన్నారు. రాబోయే ఎన్నికల్లో ఈ విషయంలో ఏం చేయాలో ప్రజలే ఆలోచిస్తారన్నారు. అంతిమంగా జిల్లా అధికారులు, రాష్ట్ర ఎన్నికల కమిషన్ పారదర్శకంగా క్యాతన్‌పల్లి మున్సిపల్ ఎన్నిక నిర్వహించేలా చొరవ తీసుకోవాలన్నారు.
జైలుకు వెళ్లాక కూడా కాంగ్రెస్ సర్కార్ తనపై కక్షసాధింపు చర్యలకు ఒడిగట్టిందన్నారు. నేను ఉన్న బారాక్‌లో సీసీటీవీ పెట్టి మరీ మానిటర్ చేశారన్నారు. దోమలు ఎక్కువగా ఉన్న రూమ్‌లో పెట్టారన్నారు. సమయానికి తాగునీరు ఇవ్వకుండా, భోజనం పెట్టకుండా ఇబ్బందికి గురిచేశారని, చివరకు గొంతు నొప్పి ఉందని చెప్పినా మందు బిల్లు లు కూడా ఇవ్వలేదన్నారు. దుప్పటి కావాలని అడిగితే పై నుంచి ఆదేశాలు రావాలని చెప్పారని, ఆ దుప్పటి కోసం మా ఆదిలాబాద్ న్యా యవాది మూడు రోజులు పోరాటం చేయాల్సి వచ్చిందన్నారు. ఇప్పటికైనా అరాచకాలు మా నుకోవాలన్నారు. ఇంత జరిగాక కూడా మా కౌన్సిలర్లకు సంబంధించిన బంధువుల దగ్గరకు పోయి బాల్కసుమన్, సీపీఐ వాళ్లు కౌన్సిలర్లను కిడ్నాప్ చేశారని పిటిషన్ ఇవ్వమని పోలీసోళ్లు అడుగుతున్నారంటే, ఇంత కంటే దుర్మార్గం, దారుణం ఏమీ ఉండదన్నారు. మంత్రి వివేక్ చెప్పినట్లు బీఆర్ఎస్-సీపీఐకి మధ్య ఎలాంటి గొడవ లేదన్నారు. ఎన్నికల ముందే మేం చైర్మన్, వాళ్లు వైస్ చైర్మన్, నాలు గు కో-ఆప్షన్లలో మాకు మూడు, వాళ్లకు ఒకటి.. అదీ కూడా క్లీయర్‌గా అనుకున్నామన్నారు. బాల్కసుమన్‌ను అరెస్టుకు తనకు సంబంధం లేదని బుకాయించిన మంత్రి వివేక్.. 17న సాయంత్రం చెన్నూర్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌లో పెట్టిన విలేకరుల సమావేశంలో.. బాల్కసుమన్ మీద వెంటనే హత్యాయత్నం కేసు పెట్టాలని పోలీసులను ఆదేశించారన్నారు. అన్నీ చేసిన ఆయనే.. నేను ఏమీ చేయలేదని చెప్పడానికి అది నోరా.. మరి ఇంకేదైననా అర్థం కావడం లేదన్నారు. నేను జైలులో ఉన్న సందర్భంగా నేను బయటికి రావాలని కోరుకున్న ప్రజలందరికీ, మా పార్టీ నాయకులు, కార్యకర్తలందరికీ, మా సోషల్ మీడియా వారియర్స్‌కు, మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు అన్నారు. జైలులో నేను ఉన్నప్పుడు నాకు మనో ధైర్యం కల్పించడానికి జైలుకు వచ్చిన మా నాయకులు కేటీఆర్, హరీశ్‌రావు, మా మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలకు, ప్రస్తుత ఎమ్మెల్యేలు, మా పార్టీ నాయకులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు అన్నారు. నాకు ధైర్యం ఇస్తూ ఎప్పటికప్పుడు అటు హైదరాబాద్‌లో, ఇటు మంచిర్యాలలో నాకు బెయిల్ రావడానికి మా లీగల్ సెల్‌ను అలర్ట్ చేసిన మా పార్టీ పెద్దలు, తెలంగాణ తొ లి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఇంత గొడవ జరిగినా, కాంగ్రెసోళ్లు బె దిరింపులకు, ప్రలోభాలకు ఏ మాత్రం తలొగ్గకుండా సీపీఐ నాయకులు మాతోనే ఉన్నారన్నారు. చైర్మన్, వైస్ చైర్మన్ అయ్యే దాకా బీఆర్ఎస్తోనే ఉంటామని చెప్పిన ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు సీతారామయ్య, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కలవేని శంకర్, జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, టౌన్ కార్యదర్శి మిట్టపల్లి శ్రీనివాస్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల మాజీ ఎమ్మె ల్యే దివాకర్‌రావు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు విజిత్‌రావు, బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు.