రెబ్బెన, ఫిబ్రవరి 24 : గంగాపూర్ గ్రామ శివారులో బాలాజీ వేంకటేశ్వరస్వామి జాతర అంగరంగ వైభవంగా సాగుతున్నది. మాఘశుద్ధ పౌర్ణమిని పురస్కరించుకొని శనివారం రెండో రోజూ భక్తులు పోటెత్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచేకాకుండా పలు ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఉదయం 4 గంటల నుంచే స్వామి వారి దర్శనం కోసం బారులు తీరారు. ఇక రథోత్సవం కనుల పండువగా నిర్వహించగా, గోవిందుడి నామస్మరణతో భక్తజనం పులకించిపోయింది. ఉమ్మడి ఆదిలాబాద్ ఎమ్మెల్సీ దండె విఠల్, సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు, ఆసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కుతో పాటు కుమ్రం భీం ఆసిఫాబాద్ కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవరావు, అదనపు కలెక్టర్లు దీపక్ తివారీ(స్థానిక సంస్థలు), వేణు(రెవెన్యూ), కాగజ్‌నగర్ ఆర్డీవో సురేశ్ స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. రెబ్బెనకు చెందిన వ్యాపారులు అన్నదానంతో పాటు మంచినీరు అందించగా, రెబ్బెన పీహెచ్సీ ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు.
ఎంపీడీవో శంకరమ్మ, ఎంపీవో రాజేశ్వర్‌గౌడ్ పారిశుధ్యంపై పర్యవేక్షించారు. పలు స్వచ్ఛంద సంస్థలు తాగునీరు, మజ్జిగ అందించారు. డీఎస్పీ కరుణాకర్ ఆధ్వర్యంలో ఏడుగురు సీఐలు, 13 మంది ఎస్ఐలు, 100 మంది సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ జయరాం, సభ్యులు గంటుమేర, రాజాగౌడ్, నర్సింగరావు, మురళీ, దుప్పనాయక్, తులసీరాం, విమల, అన్నాజీ, వడై మల్లేశ్, వనమాల స్వప్న, ఈవోలు వేణుగోపాల్గుప్తా, బాపురెడ్డి అన్ని ఏర్పాట్లు చేశారు. ఎంపీపీ జుమ్మిడి సౌందర్య, జడ్పీటీసీ వేముర్ల సంతోశ్, వైస్ ఎంపీపీ గజ్జల సత్యనారాయణ, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు లావుడ్య రమేశ్, గౌడ సంఘం అధ్యక్షుడు మోడెం సుదర్శన్‌గౌడ్ పాల్గొన్నారు.