బజార్ హత్నూర్ : భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో బజార్హత్నూర్లో చేతికి వచ్చిన మొక్కజొన్న పంటలు ఎండిపోయాయని, దాంతో తీవ్ర నష్టాన్ని చవిచుడాల్సి వచ్చిందని బీఆర్ఎస్ పార్టీ యువజన సంఘం అధ్యక్షులు డబ్బుల చంద్ర శేఖర్ అన్నారు. శుక్రవారం బజార్ హత్నూర్ మండలకేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో నాయబ్ తహసీల్దార్ హరిలాల్, మండల అగ్రికల్చర్ అధికారికి బజార్ హత్నూర్ మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మండల యువజన అధ్యక్షుడు శేఖర్ మాట్లాడుతూ.. బజార్ హత్నూర్ మండలంలోని వివిధ గ్రామాలలో సాగవుతున్న మొక్కజొన్న, జొన్న పంటలు నీరు అందక ఎండిపోతున్నాయని అన్నారు. తక్షణమే మండల కేంద్రాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల యువ నాయకులు చిక్కాల జనార్దన్, ప్రభాకర్, సుకుమార్, రైతులు తోకల విఠల్, బాల ధర్మన్న, సాయి, గుర్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.