దండేపల్లి, డిసెంబర్ 28 : దండేపల్లి మండలంలోని రేషన్ దుకాణాల ద్వారా లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్న సన్న బియ్యాన్ని సైతం అక్రమార్కులు వదలడం లేదు. ధనార్జనే ధ్యేయంగా ఎప్పటిలాగే దందా కొనసాగిస్తున్నా రు. నెల్కివెంకటాపూర్, నంబాల కేంద్రంగా రేషన్ దందా జోరుగా సాగుతున్నట్లు తెలుస్తున్నది. తాజాగా.. చింతపె ల్లి గ్రామంలో తాటికొండ వేణుగోపాల్ అనే వ్యక్తి ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 120 కిలోల రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకోవడం ఇందుకు బలం చేకూరుస్తున్నది.
నెల్కివెంకటాపూర్, నంబాల కేంద్రంగా దందా..
దండేపల్లి మండలంలో రేషన్ బియ్యం అక్రమ రవా ణా యథేచ్ఛగా సాగుతోంది. నెల్కివెంకటాపూర్, నంబా ల, వెల్గనూర్ కేంద్రాలతో పాటు మరికొన్ని గ్రామాల్లో బియ్యం నిల్వ కేంద్రాలు పెట్టి ఆటోలు, మినీ వ్యాన్లు, బొలెరో వాహనాల ద్వారా ఇతర ప్రాంతాలకు తరలిస్తూ వ్యాపారులు లక్షలు కూడబెడుతున్నారు. అక్రమ బియ్యం వ్యాపారంపై గతంలో స్థానికులు కొందరు అధికారులకు వినతిపత్రాలు అందించినా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్రమ బియ్యం దందాపై పోలీసు, రెవెన్యూ, పౌరసరఫరా అధికారులకు తెలిసినా చూసీ చూడనట్లుగా వదిలేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పేద, మధ్య తరగతి వర్గాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆహార భద్రత కార్డులు జారీ చేసి వారికి ఆసరాగా ఉండేందుకు రేషన్ బియ్యం పంపిణీ చేస్తున్నది.
తొలుత రూ.2 కిలో బియ్యం పంపిణీ చేసిన ప్రభుత్వం, ఆ తర్వాత కరోనా కష్టకాలం నుంచి రేషన్ కార్డు ఉన్న లబ్ధిదారులకు పూర్తి ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తున్నది. సివిల్ సప్లయ్ శాఖలో ఎన్ని సంస్కరణలు తెచ్చినా పీడీఎస్ దందా యథేచ్చగా కొనసాగుతున్నది. పీడీఎస్ బియ్యం అక్రమ దందాను అరికట్టడానికి రేషన్ దుకాణాల్లో ఈ పాస్, బయోమెట్రిక్ విధానం అమల్లోకి వచ్చినా దందా ఆగడం లేదు. దందాను అరికట్టాల్సిన సంబంధిత అధికారులు మొక్కుబడిగా దాడులు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నంబాలలో సెప్టెంబర్12న ఓ వ్యక్తి ఇంట్లో నిల్వ ఉంచిన 7 క్వింటాల్ల 50 కిలోల రేషన్ బియ్యాన్ని పట్టుకొని కేసు నమోదు చేశారు. తాజాగా శుక్రవారం చింతపెల్లిలో బియ్యం పట్టుబడటంతో దందా ఆగలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కిలోకు రూ.20కు కొని..
దళారులు ఇంటింటా తిరిగి రూ.20కి కొనుగోలు చేసిన బియ్యాన్ని బయట ఎక్కువ ధరకు విక్రయిస్తున్నట్లు సమాచారం. వ్యాపారులు ఈ బియ్యాన్ని అధిక ధరలకు ఇతర ప్రాంతాలైన వెల్గటూర్, కల్లెడ, సిరొంచలాంటి ప్రాంతాలకు రాత్రి పూట సరఫరా చేస్తున్నారు. కొన్ని గ్రామాల్లో రేషన్ దుకాణాల ఎదుట లబ్ధిదారుల నుంచి నేరుగా కొనుగోలు చేసి తరలిస్తున్నారంటే ఈ దందా ఎలా సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. ప్రతి నెల రేషన్ దుకాణాల్లో లబ్ధిదారులకు బియ్యం ఇవ్వడం ప్రారంభమైనప్పటి నుంచి దందా మొదలవుతున్నది. సంబంధిత అధికారులు బియ్యం దందాపై నిఘా పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని మండల వాసులు కోరుతున్నారు.
చర్యలు తీసుకుంటాం
రేషన్ బియ్యం అక్రమంగా తరలుతున్నట్లు ఇప్పటి వరకైతే ఎలాంటి సమాచారం లేదు. గ్రామాల్లో ఎవరైనా సమాచారం అందిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. రేషన్ బియ్యం సక్రమంగా లబ్ధిదారులకు అందాలని, ఎలాంటి అవకతవకలకు పాల్పడకుండా ఉండాలని డీలర్లను కూడా హెచ్చరిస్తున్నాం. చింతపెల్లిలో రేషన్ బియ్యం పట్టుకున్నట్లు సమాచారం లేదు. రేషన్ బియ్యం అక్రమార్గంలో తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.
– రోహిత్ దేశ్పాండే, తహసీల్దార్, దండేపల్లి