నిర్మల్ అర్బన్, నవంబర్ 23 : శాంతి భద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖలో వినియోగిస్తున్న నూతన టెక్నాలజీపైన ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని అధికారులకు నిర్మల్ ఎస్పీ ప్రవీణ్‌కుమార్ సూచించారు. జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయంలో బుధవారం నేర సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని పోలీస్ స్టేషన్ల వారీగా కేసుల వివరాలను పరిశీలించారు. గతంలో స్టేషన్ల వారీగా నమోదైన కేసులు, వాటి పరిష్కారాలు, పెండింగ్ కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. నేరాల నియంత్రణకు, కేసుల పరిశోధనకు అత్యంత ఉపయుక్తంగా ఉన్న సీసీ కెమరాలను ప్రతీ వ్యాపార, వాణిజ్య కేంద్రంలో ఏర్పాటు చేసుకునేలా వారిని ప్రోత్సహించి, వాటి ఉపయోగాలను వివరించాలన్నారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితులకు నమ్మకం కలిగేలా వ్యవహరించాలని, కేసులను నమోదు చేసి త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేయాలని సూచించారు.
డయల్ 100కు వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని, నిర్లక్ష్యం చేయవద్దని హెచ్చరించారు. నేరాలు, దొంగతనాలు జరుగుకుండా ముందస్తు సమాచార సేకరణ చేస్తూ ముమ్మరంగా పెట్రోలింగ్ నిర్వహించాలని సూచించారు. పోలీస్ అధికారులు, సిబ్బంది బాధ్యతతో విధులు నిర్వహించడం ద్వారానే ప్రజల మన్ననలు పొందుతారని పేర్కొన్నారు. ఫిర్యాదులపై త్వరగా స్పందించి, బాధితులకు భరోసా కల్పించాలని తెలిపారు.
పోలీసు ప్రతిభ పెరిగేలా సిబ్బంది పని చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ చూపిన పోలీసులు, సిబ్బందికి ప్రశంసాపత్రాలు అందించారు. ఈ సమీక్షా సమావేశంలో భైంసా ఏఎస్పీ కిరణ్ ఖారే, నిర్మల్ డీఎస్పీ జీవన్‌రెడ్డి, ఎస్బీ ఇన్స్పెక్టర్ రమేశ్, ఇన్స్పెక్టర్లు కుమార స్వామి, శ్రీనివాస్, అజయ్ బాబు, వినోద్, వెంకటేశ్, జిల్లాలోని అన్ని పోలీస్స్టేషన్ల ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు.