దండేపల్లి, అక్టోబర్27: అడవులను రక్షించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులు, సిబ్బందిపై చర్యలు తప్పవని కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఎఫ్డీపీటీ, జిల్లా కన్జర్వేటర్ శాంతారాం హెచ్చరించారు. దండేపల్లి మండలంలోని తాళ్లపేట రేంజ్ పరిధిలోని తానిమడుగు బీట్లో అక్రమంగా టేకు చెట్లు నరికివేసిన ప్రదేశాన్ని మంచిర్యాల జిల్లా అటవీశాఖ అధికారి(డీఎఫ్వో) శివ్ ఆశీష్సింగ్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టేకు చెట్లు నరికివేసిన వారిని గుర్తించి కేసులు నమోదు చేసి జైలుకు పంపించాలని ఆదేశించారు.
అడవులతో పాటు వన్యప్రాణుల సంరక్షణకు సమీప గ్రామాల్లోని ప్రజలకు అవగాహన పెంపొందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జన్నారం డివిజన్ పరిధిలోని విద్యార్థులకు సీతాకోక చిలుకల సర్వే, పక్షులపై సర్వే నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం జన్నారం డివిజన్ సిబ్బందితో ప్రొటెక్షన్ మీటింగ్ నిర్వహించి అడవుల రక్షణకు సంబంధించి పలు కీలక సూచనలు అందించారు. అడవుల రక్షణ కోసం పాటు పడాలని, విధులపై నిర్లక్ష్య ధోరణి తగదని సిబ్బందిని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తాళ్లపేట ఎఫ్ఆర్వో సుష్మారావు, మంచిర్యాల ఫ్లయింగ్ స్కాడ్ ఎఫ్ఆర్వో రమాదేవి, ఎఫ్ఎస్వో, ఎఫ్బీవో, బేస్ క్యాంప్ సిబ్బంది ఉన్నారు.