ఎదులాపురం, డిసెంబర్13 : ఆదిలాబాద్ మండలంలోని రామాయి గ్రామంలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌కు ఓ దుండగుడు కన్నం వేసి చోరీకి యత్నించాడని ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్ జీవన్‌రెడ్డి తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఆదిలాబాద్ రూరల్ మండలంలోని రామాయి గ్రామంలో గురువారం రాత్రి ఓ దుండగుడు టీజీబీ బ్యాంకు భవనానికి రంధ్రం చేసి కర్ర సహాయంతో లాకర్‌ను తెరిచే క్రమంలో పెద్దగా సైరన్ మోగింది. దీంతో దుండగులు అక్కడి నుంచి పారిపోయాడు. బ్యాంక్ అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన రూరల్, ఆదిలాబాద్ వన్, టూటౌన్, జైనథ్ సీఐలు అక్కడికి చేరుకున్నారు. బ్యాంకు చుట్టుపక్కల పంట చేలు ఉండడంతో రంధ్రం చేసేటప్పుడు ఎవరూ గమనించలేక పోయారన్నారు. సీసీ పూటేజ్‌ను పరిశీలించగా గురువారం రాత్రి 1.30 గంటలకు బ్యాంకుకు రంధ్రం చేసి ప్రవేశించేందుకు యత్నించినట్లు రికార్డయింది. దుండగుడు చెప్పులు అక్కడే విడిచి వెళ్లాడు. డాగ్‌స్కాడ్, క్లూస్ టీం సిబ్బంది వచ్చి ఆధారాలు సేకరించారు. బ్యాంక్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ ఎస్ఐ ముజాహిద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు డీఎస్పీ ఎల్.జీవన్ రెడ్డి తెలిపారు.
20 లక్షల నగదు, 15తులాల బంగారం సేఫ్
బ్యాంక్‌లో రూ.20లక్షలు, 15 తులాల బంగారు ఆభరణలు భద్రంగా ఉన్నట్లు బ్యాంక్ అధికారులు తెలిపినట్లు డీఎ స్పీ తెలిపారు. బ్యాంక్‌లో సీసీ కెమెరాలు, అలారం సిస్టమ్ ఏర్పాటు చేసుకోవాలని రూరల్ ఎస్ఐ ముజాహిద్ బ్యాంక్ అధికారులకు కొన్ని నెలల క్రితమే సూచించినట్లు తెలిపారు.