“గతేడాది డిసెంబర్ 18న ఆర్అండ్ఆర్ తాళ్లపల్లి ప్లాట్స్ సమీపంలో ఓ సామాజిక కార్యకర్తపై కొందరు రాళ్లతో దాడి చేశారు. ఆయన తప్పించుకొనే ప్రయత్నం చేయడం, అదే సమయానికి ఆయన స్నేహితుడు అక్కడికి రావడంతో దాడి చేసిన వ్యక్తులు పారిపోయారు. స్వల్పగాయాలతో సదరు వ్యక్తి బయటపడ్డాడు.”
“జనవరి 15న మంచిర్యాలలోని మటన్ అండ్ ఫిష్ మార్కెట్లో మంచిర్యాలకు చెందిన ఓ రాజకీయ పార్టీ నాయకుడిపై కొందరు దాడి చేశారు. ముక్కు, చెవుల నుంచి రక్తం వచ్చేలా కొట్టారు. గతంలో ఏదో రోడ్డు పనులపై ఫిర్యాదు చేశానని, దానిని దృష్టిలో పెట్టుకొనే దాడి చేశారంటూ బాధితుడు స్వయంగా చెప్పాడు.”
(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : …ఇలా ఈ రెండు కేసులనే కాదు. మంచిర్యాలలో గతేడాది కాలంగా ఇలాంటి దాడులు జరగడం పరిపాటిగా మారింది. ఎవరు ప్రశ్నించినా, ఎవరు అడ్డు వచ్చినా కచ్చితంగా దెబ్బలు తినాల్సి వస్తుందనే భయం జనాల్లో నాటుకుపోతున్నది. గతంలో ఇదే తరహాలో దాడులు జరిగిన నేపథ్యంలో మీడియా వాటిపై ప్రధానంగా దృష్టి సారించింది. ప్రభుత్వం, పోలీసులు సీరియస్‌గా తీసుకోవడంతో కొన్ని రోజుల పాటు ఎలాంటి అలజడి కనిపించలేదు. కానీ, మంచిర్యాలలో మరోసారి దాడుల సంస్కృతి మొదలైందా అంటే.. అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. గతేడాది సైతం ఇలాంటి దాడులు, ప్రతిదాడులు జరిగాయి. వినాయక నిమజ్జనంలో కత్తుల కొట్లాట, మాధవి బార్ ముందు హాకీ స్టిక్స్ గొడవ, బీఆర్ఎస్ లీడర్ రాకేశ్‌పై దాడి.. బైపాస్‌రోడ్డులో గ్యాంగ్‌ల గొడవలు.. సద్దుల బతుకమ్మ రోజున గల్లీ గొడవలు.. ఇలా చెప్పుకుంటూ పోతే మంచిర్యాల దాడులపై ఓ పుస్తకమే రాయాల్సి వస్తుందనడంలో అతిశయోక్తి లేదు.
ఇలాంటి వరుస ఘటనల నేపథ్యంలో గతేడాది దాడుల వ్యవహారం పెద్ద దుమారమే రేపింది. మీడియా దృష్టి సారించడం.. అన్ని పత్రికలు, టీవీ ఛానళ్లలో కథనాలు వచ్చిన నేపథ్యంలో పోలీసులు దీన్ని సీరియస్‌గా తీసుకున్నారు. ఇలాంటి ఘటనతో సంబంధం ఉన్న వారందరినీ పిలిపించి మాట్లాడారు. ఇలాంటివి పునరావృతమైతే ఊరుకునేది లేదంటూ తీవ్రంగా హెచ్చరించారు. పోలీసులు సీరియస్‌గా ఉన్నారనో.. ఇతర రాజకీయ కారణాలో తెలియదు కానీ.. కొన్నాళ ్లపాటు దాడులకు దూరంగా ఉంటూ వచ్చిన గ్యాంగ్‌లు మళ్లీ రెచ్చిపోతున్నాయి. ఇలాంటి ఘటనలు ఎప్పుడు జరిగినా వెంటనే సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. కానీ కొన్నిసార్లు పోలీసులే అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతేడాది డిసెంబర్ 18న జరిగిన దాడి ఘటనలో తాను చెప్పిన ప్రకారం కాకుండా వేరే మాదిరిగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారని సామాజిక కార్యకర్త ఆరోపిస్తున్నారు. తనపై దాడికి రెండు రోజులు ముందు నుంచే ప్లాన్ చేశారని, ఫోన్ చేసి బయటికి వచ్చేలా చేశారని.. ఇందుకు ప్రధాన కారకులైన ఇద్దరి వ్యక్తుల పేరను ఫిర్యాదులో స్పష్టంగా పేర్కొన్నానని.. కానీ వారి పేర్లు ఎఫ్ఐఆర్లోనే లేకుండా చేశారిన బాధితుడు చెబుతున్నాడు. పోనీ వాళ్లని పట్టుకొని అడగాల్సిన పోలీసులు.. పిలిస్తే సదరు వ్యక్తులు స్టేషన్‌కు రావడం లేదని చెబుతున్నారని వాపోతున్నాడు. దాడి ప్రదేశంలో ఉన్న సీసీ కెమెరాలు పని చేయడం లేదని అంటున్నారని, తనను కొట్టి లాక్కెళ్లిన ఫోన్లో దాడికి కారకులైన వ్యక్తులు మాట్లాడిన ఆధారాలున్నాయని చెబుతున్నా.. ఆ ఫోన్‌ను ఇప్పటి వరకూ రికవరీ చేయలేదంటున్నాడు. తనపై దాడి చేసిన వారిపై హత్యాయత్నం, దొంగతనంలాంటి సెక్షన్ల కింద కేసు పెట్టకుండా బెయిలేబుల్ సెక్షన్ల కింద కేసు పెట్టారని సదరు వ్యక్తి ఆరోపిస్తున్నాడు. ఈ విషయంపై సీపీ, డీసీపీలకు ఫిర్యాదు చేస్తే ఏ స్టేషన్లో నామమాత్రపు కేసు నమోదు చేశారో అదే స్టేషన్‌కు బదలాయించి చేతులు దులిపేసుకున్నారంటున్నాడు. గతంలో ఇలాంటి దాడుల వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు ఈ కేసులో ఇంకా దాడి చేసిన వ్యక్తులను గుర్తించకపోవడం కొనమెరుపు. బాధితుడి కథనం ప్రకారం కేసు ఎందుకు నమోదు చేసి, కారకులైన వారిని ఇంకా ఎందుకు గుర్తించలేదు.. అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే కేసును పోలీసులు కొంత సీరియస్‌గా తీసుకొని బాధితుడికి న్యాయం జరిగేలా చేసి ఉంటే మంచిర్యాలలో మరో దాడి జరిగేది కాదనే చర్చ ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది.
మంచిర్యాలలో జరుగుతున్న వరుస దాడులు వెనుక రాజకీయ కక్షలు ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తున్నది. బాధితులు చెబుతున్న కథనాలు అలాగే ఉంటున్నాయి. మొన్నటికి మొన్న జనవరి 15న ఓ రాజకీయ నాయకుడిపై దాడి చేసింది ఎవరో ఆయనే స్వయంగా వెల్లడించారు. రెండున్నరేళ్ల క్రితం ఏదో రోడ్డు పనులు సరిగా చేయడం లేదని తాను ఇచ్చిన ఫిర్యాదుతో ఆ పనులు ఆగిపోయాయని.. దానితో సదరు వ్యక్తి అనుచరులతో తనపై దాడి చేశారంటూ ఆయన చెప్పుకొచ్చారు. డిసెంబర్ 18న దాడి ఘటనలతో బాధితుడు సైతం ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, పలు అంశాలపై ఆర్టీఐలు వేయడం మూలంగానే తనపై దాడి చేశారని చెబుతున్నారు. ఇలా దాడుల వెనుక ఉన్న రాజకీయ కారణాలు ఉండడం పలు అనుమానాలకు తావిస్తున్నది. ఇప్పటికైనా ఈ దాడుల వ్యవహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు సీరియస్‌గా తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.