తిర్యాణి, అక్టోబర్ 26: జల్, జంగల్, జమీన్ పోరాటంలో వెడ్మ రాము పోరాటం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. తిర్యాణి మండలంలోని ఏదులపాడ్ గ్రామంలో ఆదివారం నిర్వహించిన వెడ్మ రాము 38వ వర్ధంతి సభకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు.వెడ్మ రాము విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడుతూ నాడు జల్, జంగల్, జమీన్ కోసం కుమ్రం భీం, కుమ్రం సూరు, రాంజీగోండ్ పోరాడుతున్న సమయంలో కళాతపస్వీ వెడ్మ రాము వారి వెన్నంటే ఉండి తన కళారూపాలతో ఆయా గ్రామాల ప్రజలను సంఘటితం చేశారని గుర్తు చేశారు.
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కుమ్రం భీం వారసులను ఆదుకున్న విధంగానే వెడ్మ రాము వారసులను సైతం ఆదుకోవాలని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు. టూరిజంలో భాగంగా జోడెఘాట్ తరహాలో ఏదులపాడ్లో కులవృత్తిని దృష్టిలో పెట్టుకుని మ్యూజియం ఏర్పాటు చేసి, గ్రామంలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. రూ.5 లక్షలతో సోలార్ ఆర్వో ప్లాంట్ నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు. గిరిజనుల భూసమస్యలను పరిష్కరించనున్నట్లు తెలిపారు. గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే ఐటీడీఏ నిధులు రూ.90 లక్షలతో జడ్పీ రోడ్డు నుంచి గంభీరావుపేట వరకు గంభీరావుపేట నుంచి ఏదులపాడ్ గ్రామం వరకు రూ.1.20 కోట్లతో బీటీ రోడ్డు మంజూరు చేయగా టెండర్లు కూడా పూర్తయ్యాయన్నారు.
కానీ కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు మంజూరు చేయక, నిర్మాణాలు ముందుకు సాగడం లేదన్నారు. పలు అభివృద్ధి పనుల నిర్మాణాలపై గిరిజన శాఖ మంత్రి దృష్టికి సైతం తీసుకెళ్లినట్లు తెలిపారు. గోయగాం గ్రామంలో సీఎస్ఆర్, డీఎంఎఫ్టీ నిధులతో రూ.5 లక్షలతో పెరిక సంఘం కమ్యూనిటీ షెడ్ నిర్మాణానికి భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. అనంతరం పలు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని ఎమ్మెల్యేకు వెడ్మ రాము వారసులు అందజేశారు. ఈ సమావేశంలో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, డీడీ రమాదేవి, జీసీడీవో శకుంతల, ఏటీడీవో చిరంజీవి, గిరిజన క్రీడల జిల్లా అధికారి మడావి శేఖు, ఏఎంసీ మాజీ ఉపాధ్యక్షుడు, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు హన్మాండ్ల జగదీశ్, మాజీ జడ్పీటీసీ చందు, పీఏసీఎస్ చైర్మన్ చుంచు శ్రీనివాస్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ముత్యం రాజయ్య, బుర్ర మధూకర్ ఆయా గిరిజన సంఘాల నాయకులు మడావి గుణవంతరావు, గెడేం సుభాష్, పెందోర్ ధర్ము, ఆత్రం సంతోష్, వెడ్మ రాము వారసులు, ఆయా గ్రామాల్లోని గిరిజనులు తదితరులున్నారు.