నిర్మల్ చైన్‌గేట్, మార్చి 19 : తమ డిమాండ్ల సాధన కోసం ఆశ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా యూనియన్ ఆధ్వర్యంలో ఆశ వర్కర్లు ఆందోళన నిర్వహించారు. బుధవారం ఉదయం ఆరు గంటలకే కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని కార్యాలయ సిబ్బందిని లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. ప్రధాన ద్వారం వద్ద బైఠాయించి దిగ్బంధం చేశారు. నినాదాలతో కలెక్టరేట్ దద్దరిల్లింది. కలెక్టర్ బయటకు రావాలని నినాదాలు చేశారు.
గంటన్నర సేపు సిబ్బందిని లోపలికి వెళ్లకుండా ఆందోళన చేయడంతో రెవెన్యూ అదనపు కలెక్టర్ కిశోర్‌కుమార్, డీఎంహెచ్‌వో రాజేందర్లు వచ్చి వారికి నచ్చజెప్పారు. అనంతరం వినతిపత్రం అందజేశారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని అదనపు కలెక్టర్ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి బొమ్మెన సురేశ్, ఆశ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి గంగమణి, ఉపాధ్యక్షులు చంద్రకళ, భాగ్య, విజయ, సరిత, ఇంద్రమాల, నంద, జిల్లా సహాయ కార్యదర్శులు జ్యోతి, శ్యామల, సుగుణ, మౌనిక, సులోచన, జిల్లా కోశాధికారి రామలక్ష్మి, కమల, విజయ పాల్గొన్నారు.
ఎదులాపురం, మార్చి 19 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆశ కార్యకర్తల సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే పార్లమెంట్, అసెంబ్లీని ముట్టడిస్తామని సీఐటీయూ జిల్లా కార్యదర్శి అన్నమొల్ల కిరణ్ అన్నారు. తెలంగాణ ఆశ వరర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బుధవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట పికెటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆశ యూనియన్ జిల్లా కార్యదర్శి సుజాత, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు అగ్గిమల్ల స్వామి, లింగాల చిన్నన్న, తదితరులు పాల్గొన్నారు.