దిలావర్పూర్ : పెండింగ్ బిల్లులు చెల్లించాలని అసెంబ్లీ (Assembly) ముట్టడికి వెళ్తున్న మాజీ సర్పంచులను ( Former sarpanches ) అరెస్టు చేయడం అక్రమమని నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండల మాజీ సర్పంచుల సంఘం అధ్యక్షులు వీరేష్ కుమార్( Viresh Kumar) ఆరోపించారు. మాజీ సర్పంచులను గురువారం ఉదయం ఎస్సై సందీప్( SI Sandeep) ఆధ్వర్యంలో అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు.
ఈ సందర్భంగా వీరేష్ కుమార్ మాట్లాడుతూ సంవత్సర కాలంగా గ్రామపంచాయతీలో చేసిన పనులకు బిల్లులు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అన్నారు . చేసిన పనులకు బిల్లులు ఇవ్వమని అడగడమే తాము చేసిన నేరమా అని ప్రశ్నించారు. గ్రామ పంచాయతీ లను అభివృద్ధి చేయాలని లక్ష్యంతో అప్పు చేసి గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టామని, కానీ చేసిన పనులకు బిల్లులు రాక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అన్నారు .
ఇకనైనా ప్రభుత్వం స్పందించి మాజీ సర్పంచులకు రావలసిన బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు . అదే విధంగా గత కొన్ని నెలలుగా పెండింగ్లో ఉన్న మాజీ సర్పంచుల గౌరవ వేతనం (Honorarium) కూడా విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాలకు చెందిన తాజా మాజీ సర్పంచులు ఉన్నారు.