ఆసిఫాబాద్ అంబేద్కర్ చౌక్ : వర్షాకాలంలో తలెత్తే సమస్యలపై అధికారులు ముందస్తు చర్యలు తీసుకోకపోవడంతో ప్రమాదాలు పొంచి ఉన్నాయని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆసిఫాబాద్ ( Asifabad) జిల్లా కేంద్రం నుంచి నాలుగు వరుసల ప్రధాన రహదారికి ఉన్న అప్రోచ్ రోడ్డు (Approach road ) పూర్తిగా గుంతలమయమైంది.
ముఖ్యంగా గుండి గ్రామం( Gundi Village ) నాలుగు వరుసల ప్రధాన రహదారికి కనెక్టివిటీ రోడ్ కావడంతో రాకపోకలు సాగించే వాహనాల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఈ రోడ్డు వెడల్పునకు మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కలెక్టర్ కు మొర పెట్టుకున్నారు. నేటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
ఇటీవల రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రోడ్డు అధ్వాన్నంగా మారిందని వాహన దారులు ఆవేదన వ్యక్తం చేశారు. పక్కనే ఉన్న పాఠశాలకు విద్యార్థులు బురదలోనే నడుచుకుంటూ వెళ్లడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం పడుతోందని కాలని వాసులు ఆరోపించారు. ఇప్పటికైనా స్పందించి తక్షణం రోడ్డు మరమ్మతు పనులు చేపట్టాలని కోరారు.