ఆదిలాబాద్, ఆగస్టు 10(నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అమలు చేస్తున్న భూ భారతి చట్టాన్ని పకడ్బందీగా నిర్వహించడానికి లైసెన్స్డ్ సర్వేయర్లను నియమించుకోవాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇంటర్, పాలిటెక్నిక్, ఐటీఐ, బీటెక్(సివిల్) చదువుకున్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. జిల్లా వ్యాప్తంగా 400 మంది దరఖాస్తు చేసుకోగా మొదటి విడుతలో 155 మందిని ఎంపిక చేసి వారికి 50 రోజులపాటు శిక్షణ ఇచ్చారు.
జూలై 27, 28,29 తేదీల్లో అభ్యర్థులకు మూడు రకాల పరీక్షలు నిర్వహించారు. పరీక్షల నిర్వహణపై అభ్యర్థులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ప్రశ్నాపత్రంలో లోపాలు ఉన్నాయని, అంకెలు సరిగా కనిపించకపోవడంతో తాము పరీక్షలు సరిగా రాయలేకపోయామంటూ పరీక్షను రద్దు చేసి తిరిగి నిర్వహించాలంటూ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.
గత నెలలో నిర్వహించిన లైసెన్స్డ్ సర్వేయర్ పరీక్ష రాసిన అభ్యర్థులు ప్రశ్నాపత్రం సరిగా లేకపోవడంతో పాస్ అవుతామో లేదో అని ఆందోళన చెందుతున్నారు. ఫలితాలు రాకముందే అప్రెంటిస్ చేయాలంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో ఎంపిక ప్రక్రియ గందోరగోళంగా మారింది. పరీక్షలో ఉత్తీర్ణులైన వారిని మాత్రమే విధుల్లోకి తీసుకుంటారా? లేక అందరిని తీసుకుంటారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. శిక్షణ పొందని సర్వేయర్లు ఈ నెల 4న ఆయా తహసీల్దార్ కేంద్రాల్లో రిపోర్టు చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ప రీక్ష రాసిన వారు తహసీల్దార్ కార్యాలయా ల్లో రిపోర్టు చేసి రెగ్యూలర్ మండల సర్వేయర్లతో కలిసి అప్రెంటిస్‌కు పోతున్నారు.
పరీక్షలో పాస్ కాకపోతే కూడా శిక్షణ పొందిన వారికి లైసెన్స్‌లు జారీ చేస్తామని అధికారులు తమకు గ్యారెంటీ ఇవ్వడం లేదని, ప్రభుత్వ ఆదేశాల ప్రకారం తాము నడుచుకుంటున్నట్లు అంటున్నారని అభ్యర్థులు తెలిపారు. ఉత్తీర్ణులు కాని వారిని రిజక్ట్ చేస్తే ఇన్ని రోజులుగా తాము పడిన శ్రమ వృథా అవుతుందని, లైసెన్స్ జారీ విషయంలో అధికారులు స్పష్టమైన విధానాన్ని అవలంభించాలని అభ్యర్థులు కోరుతున్నారు.