మంచిర్యాల, మార్చి 17(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం అంగన్వాడీ కార్యకర్తలు కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు నిర్వహించారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల ఎదుట ఈ మేరకు తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో వంటావార్పు చేసుకుంటూ 48 గంటలపాటు నిరసనను కొనసాగించనున్నారు. ఈ సందర్భంగా అంగన్వాడీలు మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఐసీడీఎస్(ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్)ను నిర్వీర్యం చేసేందుకు కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు.
నూతన జాతీయ విద్యా విధానం పేరిట పీఎం శ్రీ, మొబైల్ అంగన్వాడీ సెంటర్స్ తీసుకొచ్చి ఐసీడీఎస్ను మూసివేయాలని చూస్తే ఊరుకోబోమని మండిపడ్డారు. రాష్ట్రంలో ఈ చర్యలను వెంటనే ఆపాలని, జాతీయ విద్యా విధానం చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేసేది లేదని అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. 50 ఏండ్లుగా ప్రీ స్కూల్ విద్యను అందిస్తున్న అంగన్వాడీ సెంటర్లకు అదనపు పనులు, ఆన్లైన్ పనులు తగ్గించి బడ్జెట్ పెంచి అంగన్వాడీ సెంటర్లనే సర్సరీ కేంద్రాలుగా మార్చాలన్నారు. ఎన్నికల సమయంలో రేవంత్రెడ్డి ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలన్నారు. ఐసీడీఎస్ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీలు పోరాటాలకు సిద్ధమయ్యామన్నారు. ప్రభుత్వం మా న్యాయమైన 23 డిమాండ్లను పరిష్కరించాలని, లేనిపక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మంచిర్యాల కలెక్టరేట్ ఎదుట తెంలగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్(సీఐటీయూ) ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి రంజిత్ తదితరులు పాల్గొన్నారు.
డిమాండ్స్..
రిటైర్మెంట్ బెనిఫిట్స్ కొనసాగించాలి..
అంగన్వాడీల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలి. గత ప్రభుత్వం రిటైర్మెంట్ బెనిఫిట్స్ ప్రకటించింది. వాటిని కొనసాగిస్తామని మంత్రి సీతక్క గతంలో చెప్పారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఎలాంటి షరతులు లేకుండా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి. రూ.18 వేల వేతనం, పీఎఫ్ సౌకర్యం కల్పించాలి. ఐసీడీఎస్ను నిర్వీర్యం చేయకుండా అంగన్వాడీలకు ఉద్యోగ భద్రత కల్పించాలి. జాతీయ విద్యా విధానాన్ని రాష్ట్రంలో అమలు చేయబోమని రేవంత్రెడ్డి సర్కార్ అసెంబ్లీ సాక్షిగా తీర్మానం చేయాలి. – భానుమతి, అంగన్వాడీ టీచర్, మంచిర్యాల
ఐసీడీఎస్ వ్యవస్థను నిర్వీర్యం చేయద్దు..
ఏండ్లుగా గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలకు ప్రీ స్కూల్ విద్యను అందిస్తూ మహిళలు, చిన్నారుల్లో పోషకాహార లోపాలను నిర్మూలించేందుకు పని చేస్తున్న అంగన్వాడీలను నిర్వీర్యం చేయడం సరికాదు. మా న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన హామీలను అమలు చేయాలి. ఐసీడీఎస్ వ్యతిరేక విధానాల అమలును వెంటనే ఆపేయాలి. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అసెంబ్లీలో స్పష్టమైన ప్రకటన చేయాలి.
– కుందార స్వాతి, హెల్పర్ మంచిర్యాల