మంచిర్యాల అర్బన్/వేమనపల్లి, సెప్టెంబర్ 15 : సమస్యలు పరిష్కరించాలని అంగన్వాడీ టీచర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఐటీయూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కార్మికశాఖ మంత్రి గడ్డం వివేక్ ఇంటి ఎదుట ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన అంగన్వాడీ టీచర్లు ధర్నా చేశారు.
అంగన్వాడీల యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర అధ్యక్షురాలు సునీత, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు త్రివేణి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంగన్వాడీ యూనియన్ నాయకులు భానుమతి రాజమణి, మంచిర్యాల జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు గోమాస ప్రకాశ్‌ను పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి మంచిర్యాల పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అక్కడ కూడా ధర్నాకు దిగారు.
వారు మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అంగన్వాడీ ఉద్యోగులకు రూ. 18 వేల వేతనం ఇస్తామని హామీ ఇచ్చారని, ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదన్నారు. ఇప్పటికే సమస్యలపై ఐసీడీఎస్ కమిషనర్‌కు, సంబంధిత శాఖ మంత్రికి, అధికారులకు వినతి పత్రాలు ఇచ్చామని, ఇప్పటి వరకు ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ఐసీడీఎస్‌ను కాపాడాలని, అంగన్వాడీల్లోనే ప్రీ సూల్ నిర్వహించాలని కోరారు.
పీఎంశ్రీ నిధులను అంగన్వాడీ కేంద్రాలకు కేంటాయించాలని, అంగన్వాడీ సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఢిమాండ్ చేశారు. ఖాళీగా ఉన్న టీచర్, హెల్పర్ పోస్టులను భర్తీ చేయాలని, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించాలన్నారు. ఆన్లైన్ యాప్‌ను రద్దు చేసి, పేస్ క్యాప్చర్‌ను తీసివేయాలని డిమాండ్ చేశారు. సర్కారు దిగిరాకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కాగా, అంతకుముందు సీఐటీయూ జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్‌ను ఆయన ఇంటి వద్ద పోలీసులు అరెస్టు చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి మంచిర్యాలలోని మంత్రి వివేక్ ఇంటికి బయలుదేరిన అంగన్వాడీ ఉద్యోగులను ఎక్కడికక్కడ అరెస్టు చేశారు.
ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నాయకులు చల్లూరి దేవదాస్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నాయకులు వినోద, అరుణ, సబితా,లక్ష్మి, పద్మావతి, శారద, శిరీష, రాణి, సరిత, రాజేశ్వరి, ప్రవీణ, గంగభవానీ, మానస పాల్గొన్నారు. వేమనపల్లి నుంచి మంచిర్యాలలోని మంత్రి వివేక్ ఇంటికి బయలుదేరిన అంగన్వాడీలను నీల్వాయి పోలీసులు అదపులోకి తీసుకున్నారు. ఆర్టీసీ బస్సులో ఉండగా అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం కొద్ది సేపటి తర్వాత విడిచిపెట్టారు. ఆపై వారంతా ప్రైవేటు వాహనాల్లో మంచిర్యాలకు వచ్చారు. అరెస్టు అయిన వారిలో చిగురాల రజిత, దాసరి రాణి, జయ ఉన్నారు.
ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మికి వినతి
ఆసిఫాబాద్ టౌన్, సెప్టెంబర్ 15 : సమస్యలు పరిష్కరించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరుతూ అంగన్వాడీ టీచర్లు సోమవారం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే కోవ లక్ష్మిని కలిసి వినతిపత్రం అందజేశారు. సమస్యల పరిషారం కోసం తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే చెప్పారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం అంగన్వాడీ టీచర్ల సంక్షేమానికి ప్రాధాన్యమిచ్చిందని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వారి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు పాల్గొన్నారు.