నార్నూర్, డిసెంబర్ 25 : గత పాలకులు పట్టించుకోకపోవడంతో అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలు లేక ఇంట్లో, ప్రైవేట్ భవనాల్లో కాలం వెలదీశారు. దీంతో కేంద్రాలకు వచ్చే గర్భిణులు, బాలింతలు, చిన్నారులు ఇబ్బందులు పడేవారు. స్వరాష్ట్రంలో సొంత భవన నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సొంత భవన నిర్మాణాలు పూర్తయితే కష్ట్టాలకు చెక్‌పడనుంది. నార్నూర్, గాదిగూడ మండలాల్లో మొత్తం 20 అంగన్వాడీ భవనాలు ప్రభుత్వం మంజూరు చేసింది. వాటి నిర్మాణానికి రూ.కోటి కేటాయించింది. ఒక్కో భవన నిర్మాణానికి రూ. 5 లక్షలు మంజూరు చేయడంతో పనులు చేపట్టారు. అంగన్వాడీ భవన నిర్మాణ పనుల పర్యవేక్షణను సామగ్ర గిరిజన సంక్షేమ శాఖ ఇంజినీరింగ్ అధికారులకు అప్పగించింది. మంజూరైన గ్రామాల్లో పనులు ప్రారంభించేలా ఇంజినీరింగ్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. భవన నిర్మాణ పనులు ముమ్మరంగా కొనసాగుతుండడంతో ఇబ్బందులు తొలగిపోతాయని స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్ భవనాల్లో ఉంటున్న అంగన్వాడీ కేంద్రాలకు క్రమేపీ విముక్తి కలిగించడానికి చర్యలు తీసుకుంటున్నారు. వాటికి సొంత భవనాలు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం దశల వారీగా సొంత భవనాల నిర్మాణం తలపెట్టింది. సంబంధిత శాఖ అధికారులు పర్యవేక్షిస్తూ పనులు సకాలంలో పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని ఐటీడీఏ ఇంజనీరింగ్ అధికారులు పేర్కొంటున్నారు.
మంజూరైన గ్రామాలు ఇవే..
గాదిగూడ, నార్నూర్ మండలాల్లోని అర్జుని కొలాంగూడ, జంగుగూడ, ఎంపల్లి కొలాంగూడ, వార్కవాయి, మేడిగూడ, పిప్రి, పర్సువాడ(కే), భూయిలీకసా, చిన్నకుండి, శైడ్వాయి కొ లాంగూడ, కుండి, కునికసా కొలాంగూడ, మారేగావ్, నడ్డంగూడ, రాముగూడ, శివ్నరా, భీంజిగూడ, కొత్తపల్లికొలాంగూడ గ్రామాలకు అంగన్వాడీ భవనాలు మంజూరు చేసింది.
పనులు ప్రారంభిస్తున్నాం
నార్నూర, గాదిగూడ మండలాలకు 20 అంగన్వాడీ భవనాలు మంజూరు అయ్యాయి. భవనం మంజూరైన గ్రామంలో పనులు ప్రారంభిస్తున్నాం. సకాలం పనులు పూర్తి చేసేలా కృషి చేస్తాం.
రాథోడ్ సునీల్, ఏఈ, ఐటీడీఏ