మంచిర్యాల, మే 23(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : చెరువుల పునురుద్ధరణకు ఉద్దేశించి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమృత్ 2.0 పథకం మంచిర్యాల జిల్లాలో అక్రమార్కులకు వరంగా మారింది. మంచిర్యాల జిల్లాలో ఏడు చెరువులు, ఆదిలాబాద్ జిల్లాలో నాలుగు చెరువులను ఎంపిక చేయగా, నస్పూర్ పెద్ద చెరువులో ఎలాంటి వర్క్ ఆర్డర్లు లేకుండానే పనులు చేపట్టడం విమర్శలకు తావిస్తున్నది.
రాష్ట్రవ్యాప్తంగా 43 చెరువుల పునరుద్ధరణకు అమృత్ 2.0 కింద నిధులు మంజూరయ్యాయి. మొత్తం పనులన్నీ సీఎం రేవంత్‌రెడ్డి బంధువుల కంపెనీకే అప్పగించినట్లు తెలుస్తున్నది. ఆ కంపెనీ మంచిర్యాల జిల్లా లో చేస్తున్న పనులను సబ్ కాంట్రాక్టర్లకు అప్పగించింది. ఈ క్రమంలో మంచిర్యాల జిల్లాలో న స్పూర్ పెద్ద చెరువు పునరుద్ధరణ పనులను దక్కించుకున్న ఓ సబ్ కాంట్రాక్టర్ అక్రమాలకు తెరలేపారు. రూ.3.14 కోట్లతో చేపట్టిన పనుల్లో చెరువు కట్ట బలోపేతానికి సంబంధించి మట్టి ప నులు ఇటీవల చేపట్టారు. చెరువు కట్టలో 765 మీటర్లను ఎంపిక చేసుకొని పనులు చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు చెరువులోని మట్టి తీసి కట్టకు పోసి, దాన్ని బలోపేతం చేయాలి. ఇందుకు సంబంధించి కట్టకు మట్టి పోసే పనులు దాదాపు 10 రోజుల క్రితమే పూర్తయ్యాయి. కానీ, సబ్ కాంట్రాక్టర్ అమృత్ 2.0 పనుల పేరుతో చెరువులోని మట్టి తీసి బహిరంగ మార్కెట్‌కు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నాడు. అర్ధరాత్రి 10 గంటలకు మొదలుపెట్టి ఉదయం 3 గంటల దాకా పదుల సంఖ్యలో ట్రాక్టర్లతో మట్టిని చెరువు బయటికి తెచ్చి పక్కనే ఉన్న ఓ వెంచర్లో డంప్ చేస్తున్నాడు. అక్కడి నుంచి రోజూ తెల్లవారుజామునే లారీల్లో ఆ మట్టిని బహిరంగ మార్కెట్లోకి తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. దాదాపు 10 రోజులుగా యథేచ్ఛగా ఇలా మట్టి అక్రమ రవాణా జరుగుతున్నా… అడిగే నాథుడే లేకుండా పోయాడు. మట్టి అక్రమ రవాణా చేస్తున్నారని తెలిసి శుక్రవారం అర్ధరాత్రి ‘నమస్తే తెలంగాణ’ చెరువును సందర్శించిగా.. దాదాపు పది ట్రాక్టర్లతో మట్టిని తోడి, ట్రిప్పుల కొద్ది మట్టిని తెచ్చి పక్కనున్న వెంచర్లో డంప్ చేస్తున్న దృశ్యాలు కనిపించాయి.
చెరువు పునరుద్ధరణ పనులు చేస్తున్న కాంట్రాక్టర్, దాని కట్ట బలోపేతానికి సంబంధించిన పనులు చేయాలి కానీ.. సదరు కాంట్రాక్టర్ ట్రాక్టర్లు చెరువు నుంచి బయటికి వచ్చేందుకు వీలుగా ఉన్న కట్టను తొలగించారు. ఇంత చేసినా ఇరిగేషన్ అధికారులు గానీ, ప్రస్తుతం పనులు చేయిస్తున్న పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులకుగానీ అది కనిపించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రోజూ లక్షల రూపాయాల విలువైన మట్టిన ఓ కాంట్రాక్టర్ దోచుకుపోతుంటే, అది కూడా చెరువు కట్టను తొలగించి మరీ మట్టి అక్రమ రవాణా చేస్తుంటే అధికారులు చర్యలు తీసుకోకపోవడం వెనుక మతలాబేమిటన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా, ఈ పనుల విషయంలో అధికారుల వ్యవహారశైలి సైతం అనుమానాలకు తావిస్తున్నది. ఏ పనైనా కాంట్రాక్టర్‌కు అప్పగించాక వర్క్ ఆర్డర్ అంటూ ఉండాలి. కానీ ఈ పనులకు ఇంకా వర్క్ ఆర్డర్ రాలేదని, మోడల్ వర్క్స్‌లో భాగంగా ఈ పనులు చేయిస్తున్నామంటూ ఉన్నతాధికారులే చెబుతున్నారు. ఎలాంటి గవర్నమెంట్ ఆర్డర్ రాకుండానే మట్టి పనులు ఎలా చేశారు, దానికి అధికారులు ఎలా అనుమతించారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఒకవేళ అధికారుల అనుమతులతోనే పనులు జరిగాయనుకున్నా అక్రమ మట్టి రవాణా చేసి కాంట్రాక్టర్ వర్క్ ఆర్డర్‌లోని నిబంధనలను ఉల్లగించారు. ఇలా చేస్తే ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నది వర్క్ ఆర్డర్లో ఉంటుంది. కానీ, ఇప్పుడు అలాంటి వర్క్ ఆర్డర్ ఏదీ రాలేదని అధికారులు చెబుతుండడం విమర్శలకు తావిస్తున్నది. ఇటు ఇరిగేషన్ అధికారులేమో ఆ పనులు పబ్లిక్ హెల్త్‌కు అప్పగించామని, మాకు సంబంధం లేదని చెబుతుంటే, అటు పబ్లిక్ హెల్త్ అధికారులేమో పది రోజుల క్రితమే మా పనులు అయిపోయాయని కాంట్రాక్టర్ తరలిస్తున్న మట్టికి మాకు ఎలాంటి సంబంధం లేదంటూ చెబుతున్నారు. ఇలా రెండు శాఖల అధికారులు ఎవరికి వారు తప్పించుకునే సమాధానాలు చెబుతుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అక్రమ మట్టి రవాణా చేసిన సబ్ కాంట్రాక్టర్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఈ పనులు చేస్తున్న కాంట్రాక్ట్ సంస్థపైనా చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ వినిపిస్తున్నది.
మట్టి అక్రమ రవాణా చేస్తూ అడ్డంగా దొరికిన కాంట్రాక్టర్ ‘నమస్తే తెలంగాణ’ వచ్చిన విషయం తెలుసుకొని హుటాహుటిన చెరువు వద్దకు వచ్చారు. అమృత్ 2.0 పనుల కోసం మట్టి తవ్వుతున్నామని చెప్పారు. నిబంధనల ప్రకారం ఉదయం వేళ కదా పని చేయాల్సింది. ఇంత అర్ధరాత్రి ఎందుకు మట్టి తీస్తున్నారు. ఒకవేళ మీరు కట్ట పనుల కోసం మట్టి తీస్తే చెరువు దాటి పోవడానికి లేదు. అలాంటిది చెరువులో మట్టి తెచ్చి ఓ ప్రైవేట్ వెం చర్లో ఎందుకు పోస్తున్నారని ప్రశ్నించగా, రాత్రి ట్రాక్టర్లు నడిపేందుకు డీఈ అనుమతి ఇచ్చారని.. ఉదయం తీసుకెళ్లి మళ్లీ కట్టకు మట్టి పోస్తా మంటూ పొంతన లేని సమాధానాలు చెప్పారు. స్థానిక ఎమ్మెల్యే, కార్పొ రేటర్లు ఇందిరమ్మ ఇండ్లకు మట్టి పోయమని.. చెబితే తీసుకెళ్లి పోస్తున్నా మంటూ బుకాయించారు. నిబంధనల ప్రకారం చెరు వులో మట్టి తీస్తే అది కట్టకే పోయాలి. కానీ, చెరువు దాటుకొని మట్టి రావడానికి లేదు. ఇలా తెచ్చి డంపులుగా పోసిన మట్టిని లారీల్లో బహి రంగ మార్కెట్‌కు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నట్లు స్థానికులు చెబు తున్నారు. రాత్రి వేళ ట్రాక్టర్లు నడుపుతున్న వారిలో అనేక మంది 15 సంవత్సరాల లోపు పిల్లలనీ, వారికి ఎవరికి లైసెన్సులు కూడా లేవని, ఏదైనా జరగరానిది జరిగితే బాధ్యత ఎవరు తీసుకుంటారని ప్రశ్నిస్తు న్నారు. స్థానికంగా ఓ కార్పొరేటర్ మేనమామగా ఉన్న సదరు కాంట్రాక్ట ర్ స్థానికులను భయభ్రాంతులకు గురి చేస్తూ, ఇష్టారాజ్యంగా మట్టి అక్ర మ రవాణా చేస్తున్నారంటూ స్థానికులు మండిపడుతున్నారు. ఆ కార్పొ రేటర్ పేరు, ఎమ్మెల్యే పేరు చెప్పి దందా నడిపిస్తున్నాడని వాపోతున్నారు.
నస్పూర్ చెరువు కట్టపై అమృత్ 2.0 కింద చేయాల్సిన పనులు 10 రోజుల క్రితమే పూర్తయ్యాయి. ఇప్పుడు కాంట్రాక్టర్ ఎందుకు మట్టి తరలిస్తున్నారో మాకు తెలియదు. చెరువు నుంచి మట్టి బయటికి తెచ్చేందుకు ఎలాంటి అనుమతులు లేవు. అక్రమ మట్టి రవాణా చేసినందుకు కాంట్రాక్టర్‌పై పోలీస్ కేసు నమోదు చేస్తామన్నారు. వర్క్ ఆర్డర్లు మాకు ఇంకా రాలేదు. కాంట్రాక్ట్ సంస్థపైనే కేసు నమోదు చేస్తాం. సబ్ కాంట్రాక్టర్‌తో మాకు సంబంధం లేదు. వర్క్ ఆర్డర్ వచ్చాక దాన్ని అనుసరించి ఎలాంటి చర్యలు తీసుకోవాలో పరిశీలించి ఆ మేరకు చర్యలు తీసుకుంటాం.
– మధూకర్, డీఈఈ పబ్లిక్‌హెల్త్