మంచిర్యాల టౌన్, నవంబర్ 27 : మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్‌కు సంబంధించిన వాహనాల నుంచి నిత్యం పెట్రోల్ చోరీ అవుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా.. రాజీవ్‌నగర్‌లో బూడిదసాగర్ అనే పారిశుధ్య కార్మికుడు రోజూ చెత్త వాహనంలో నుంచి పెట్రోల్ తీస్తుండడాన్ని గమనించిన స్థానికులు వీడియో తీసి సోషల్‌మీడియాలో పెట్టగా, వైరల్ అయ్యింది. దీంతో సదరు కార్మికుడిని అధికారులు విధుల నుంచి తప్పించారు. గతేడాది డిసెంబర్లో ఓ డ్రైవర్ మున్సిపల్ చెత్త వాహనంలో నుంచి పెట్రోల్ తీసి సీసాల్లో నింపగా, పలువురు అధికారులకు సమాచారమిచ్చారు. వాహనంలో నుంచి దొంగిలించిన ఆ పెట్రోల్‌ను తన సొంత కారులో పోసుకుంటానని అతడు చెప్పాడు. ఆ తర్వాత మాట మార్చి పెట్రోల్ బంకులో పోసుకున్నానని తెలుపగా, అధికారులు విచారణకు ఆదేశించారు. కానీ, వారం తిరుగక ముందే సదరు డ్రైవర్‌ను మళ్లీ విధుల్లోకి తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ప్రతి నెలా రూ. ఐదు లక్షల పైబడి భారం
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్లో పారిశుధ్య విభాగంలో ఆటోట్రాలీలు, ట్రాక్టర్లు, జేసీబీలు, ల్యాడర్లు, బయోటాయిలెట్ బస్సు, స్వీపింగ్ మిషిన్లు, వైకుంఠరధాలు 125 వరకు ఉన్నాయి. వీటిలో 20 వరకు మరమ్మతులకు గురైనట్లు తెలుస్తున్నది. ఇంజినీరింగ్ విభాగంలో తాగునీరు సరఫరా కాని ప్రాంతాల్లో తొమ్మిది ట్రాక్టర్ ట్యాంకర్ల ద్వారా నీరందిస్తున్నారు. వీటితో పాటు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం, ముల్కల పంప్‌హౌస్, వాటర్ ట్యాంకుల వద్ద ఉన్న జనరేటర్లు నడిపిస్తున్నారు. ఇందుకోసం ప్రతినెలా పెట్రోలు, డీజిల్ కోసం రూ. 20 లక్షల నుంచి రూ. 24 లక్షల వరకు వెచ్చిస్తున్నారు.
ఇంటింటికీ వెళ్లి చెత్తను సేకరించడం, దానిని డంప్యార్డుల్లోకి తరలించడం కోసం దాదాపు 85 ఆటోట్రాలీలను డ్రైవర్లు నడుపుతున్నారు. ఇందులో చాలామంది డ్రైవర్లు ఇలా ప్రతి రోజూ పెట్రోల్‌ను చోరీ చేస్తున్నట్లు తెలుస్తున్నది. రెండు నుంచి నాలుగు లీటర్ల పెట్రోల్ చోరీకి గురవుతున్నట్లు సమాచారం. దీంతో మున్సిపల్ కార్పొరేషన్‌పై ప్రతి నెలా దాదాపుగా రూ. ఐదు లక్షలకు పైబడి భారం పడుతున్నట్లు తెలుస్తున్నది. వాహనాల కదలికలపై, కార్మికుల పనితీరుపై అధికారుల పర్యవేక్షణ సక్రమంగా లేకపోవడంతోనే ఇలా జరుగుతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. గతంలో వాహనాలకు జీపీఎస్ సిస్టంను అమర్చాలని అధికారులు భావించినప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు.