కెరమెరి, డిసెంబర్ 13 : మార్గశిర(సట్టి) మాసంలో భీమల్పేన్ వేడుకలు జరుపుకునేందుకు ఆదివాసీలు సిద్ధమవుతున్నారు. బుధవారం నుంచి మార్గశిర మాసం ప్రారంభంకాగా.. భక్తిశ్రద్ధలతో సంస్కృతీ సంప్రదాయాల నడుమ జరుపుకోనున్నారు. దీపారాధన చేసి.. ఆపై భీమదేవుని ఉత్సవాలు నిర్వహించనున్నారు. నెల రోజుల పాటు నిర్వాహకులు, పూజారులు నియమనిష్టలతో ఉండి దేవున్ని ఆరాదధిస్తారు.
ఈ సందర్భంగా కొంత మంది భీమదేవుని స్వస్థలమైన కైప్లె వద్దకు వెళ్లి మొక్కులు తీర్చుకుంటారు. దట్టమైన అడవి, ఎత్తైన గుట్టల మధ్య పవిత్ర పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన కైప్లె, సిద్ధికస వేడుకలకు ప్రాముఖ్యత ఉన్నది. కొన్నేళ్ల క్రితం సహజసిద్ధంగా ఏర్పడ్డ సిద్ధికసలోని శివలింగం, భీమసేనుడు నివాసమున్న కైప్లె గుహలను సందర్శించడం ఆనవాయితీగా వస్తున్నది. సట్టి(గోండి నెల) మాసంలో ఈ ప్రాంతాలు భక్తుల తాకిడితో సందడిగా మారుతాయి. తెలంగాణతో పాటు మహారాష్ట్రల నుంచి భక్తులు దైవ దర్శనానికి అధిక సంఖ్యలో తరలివస్తూ వైభవంగా వేడుకలను జరుపుకుంటారు.
కరంజివాడ గ్రామ పంచాయతీ పరిధిలోని శంకర్లొద్ది గ్రామ సమీపంలో గల సిద్దికస అటవీప్రాంతంలో ఓ రాతికొండ ఉంది. ఆ కొండ మధ్య భాగంలో చిన్న సొరంగంలా ఏర్పడి అందులో సహజసిద్ధంగా శివలింగం ప్రత్యక్షమైంది. గతంలో శివపార్వతులు ఈ ప్రాంతంలో నివాసమున్నారనే భక్తుల విశ్వాసం. అందుకే ఇది ఎంతో మహిమలు కలదని, కోరిన కోరికలు తీర్చే పుణ్యస్థలంగా భక్తులు నమ్ముతారు. శివలింగం పక్కన జీవనదిలా ఓ వాగు ఎప్పుడూ ప్రవహిస్తూనే ఉంటుంది. భక్తులు ముందుగా ఇందులో స్నానాలు ఆచరించిన తర్వాత శివలింగాన్ని దర్శించుకుంటారు.
శంకర్లొద్ది గ్రామం నుంచి సుమారు 3 కిలో మీటర్ల దూరంలోని అటవీ ప్రాంతంలో కైప్లె గుహ ఉంది. పాండవులు అరణ్యవాసమున్న సమయంలో భీమసేనుడు ఈ గుహలో ఉన్నట్లు ఆదివాసీలు పేర్కొనడం విశేషం. భీమసేనుడి పెండ్లి సైతం ఇక్కడే జరిగిన్నట్లు పూర్వీకులు చెబుతారు. ఈ గుహలోపల పెద్ద పెద్ద సొరంగ మార్గాలు ఉన్నాయని ఆదివాసీ పెద్దలు చెబుతుంటారు. కటిక చీకటిగా ఉండే ఈ గుహలోకి భక్తులు కాగడాల సాయంతో వెళ్తుంటారు.
గుహలోకి ప్రవేశించే ముందు ఆదివాసీలు వెలుతురు కోసం ప్రత్యేకంగా కాగడాలను తయా రు చేస్తారు. వెదురు కంకలను తీసుకొచ్చి చినచి న్న ముక్కలుగా సిద్ధం చేస్తారు. ఒక పక్కన పూ ర్తిగా మూసి ఉండగా.. మరో వైపు వొత్తులు పెట్టి అందులో ఆముదం నూనె పోస్తారు. గుహలోకి వెళ్లే సమయంలో కాగడాలను వెలిగించి వాటి వె లుతురులో లోపలికి ప్రవేశిస్తారు. లోపల పారే పవిత్ర జలంతో దేవతలకు స్నానం చేసిన అనంతరం భక్తులు సైతం పుణ్యస్నానాలను ఆచరించి బయటికి వస్తారు. ఆపై పూజలు నిర్వహిస్తారు.