ఎదులాపురం, సెప్టెంబర్ 27 : పోషకాహారంపై విస్తృతంగా అవగాహన కల్పించి, పోషకాహారం లోపం లేని జిల్లాగా ఆదిలాబాద్‌ను తీర్చిదిద్దాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద సూచించారు. పోషణ్ మాహ్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం టీటీడీసీలో పోషకాహారం ఆవశ్యకతపై నిర్వహించిన సదస్సుకు కలెక్టర్ రాజర్షి షాతో కలిసి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పోషక విలువలతో ఆహార పదార్థాలపై ప్రదర్శన స్టాళ్లను ఆమె ప్రారంభించారు. అనంతరం సమావేశంలో ఆమె మాట్లాడుతూ పూర్వికులు కూర, పప్పు, ఆకు కూరలు తిని ఆరోగ్యంగా ఉండేవారని తెలిపారు. ప్రస్తుతం పౌష్టికాహార లోపంతో రక్తహీనత, ఇతర వ్యాధుల బారిన పడుతున్నారన్నారు.
మహిళలు, బాలికల్లో ఈ సమస్య తీవ్రంగా ఉందని తెలిపారు. పోషకాహారం లోపాన్ని నివారించేందుకే పోషణ మాహ్ కార్యక్రమాన్ని తీసుకువచ్చామన్నారు. దీన్ని అంగన్వాడీ ఉద్యోగులు విజయవంతం చేయాలన్నారు. బాలికలు, మహిళల అనారోగ్య సమస్యలు, ‘గుడ్ టచ్ బ్యాడ్ టచ్’ తదితర వాటిపై అవగాహన కల్పించాలని కోరారు. గర్భిణులు, బాలింతలు, పిల్లలు తీసుకునేలా చూసి రక్తహీనత బారిన పడకుండా చూడాలన్నారు. ప్రతి అంగన్వాడీ కేంద్రంలో మహిళా కమిషన్ టోల్ ఫ్రీ నెంబర్ 94905 55533ను ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ ప్రజలు ప్యాకెజీ ఫుడ్‌కు ఎక్కువగా అ లవాటు పడుతున్నారని, అందులో సోడియం ఎక్కువగా ఉండడంలో వ్యాధుల బారిన పడుతున్నారని తెలిపారు.
ఏ పోషకాలు ఏ ఆహారంలో లభిస్తాయో పోషణ మాహ్ కార్యక్రమం ద్వారా అంగన్వాడీ ఉద్యోగులు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో మహిళ కమిషన్ సభ్యురాలు కుమ్ర ఈశ్వరీబా యి, జడ్పీ డిప్యూటీ సీఈవో కలిందిని, డీడబ్ల్యూవో బీ.సబిత, ఏసీడీపీవో మిల్క, రిమ్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ విజయలక్ష్మి, మెప్మా పీడీ మమత, సుభ్రత, విజయలక్ష్మి, కమల, కాంగ్రెస్ పార్లమెంట్ నాయకురాలు ఆత్రం సుగుణక్క, తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంజు శ్రీకాంత్ రెడ్డి, నాయకులు గిమ్మ, సంతోష్, రూపేశ్ రెడ్డి పాల్గొన్నారు.
ఇంద్రవెల్లి, సెప్టెంబర్27 : ఇంద్రవెల్లి మండలంలోని కెస్లాపూర్ నాగోబా ఆలయాన్ని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరళ్ల శారద శుక్రవారం సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గ్రామంలోని గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలకు చేరుకొని పాఠశాలను తనిఖీ చేసి ఉపాధ్యాయులు పలు సూచనలు చేశారు. సమస్యలుంటే టోల్ ఫ్రీ నంబర్లు 181, 1098కు ఫోన్ చేసి తెలుపాలని విద్యార్థినులకు సూచించారు. పలు సమస్యలను విద్యార్థినులు విన్నవించగా పరిష్కరిస్తామని తెలిపారు. నాగోబా ఆలయాన్ని సందర్శించిన తర్వాతే తాను రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు, తనిఖీలు ప్రారంభించినట్లు తెలిపారు. ఆమె వెంట రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు కుమ్రం ఈశ్వరీబాయి, మెస్రం వంశీయుల పీఠాధిపతి మెస్రం వెంకట్రావ్పటేల్, ఉట్నూర్ డీఎస్పీ నాగేందర్‌గౌడ్, ఎస్ఐ దుబ్బాక సునీల్, కెస్లాపూర్ మాజీ సర్పంచ్ రేణుకానాగ్‌నాథ్, నాగోబా ఆలయ పూజారి మెస్రం షేకు, వివిధ పార్టీల నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.