నార్నూర్ : సరిహద్దులోనూ అక్రమ రవాణాను అరికట్టాలని అదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పోలీస్ అధికారులకు సూచించారు. ఆదిలాబాద్ జిల్లా గాదిగూడ మండలంలోని పోలీస్ స్టేషన్ను ఆయన తనిఖీ చేశారు. పోలీసుల గౌరవ వందనాలు స్వీకరించారు. పలు రికార్డులు పరిశీలిస్తూ వివరాలు తెలుసుకున్నారు. పోలీస్స్టేషన్ ఆవరణలో మొక్క నాటారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పోలీసులు సక్రమమైన యూనిఫామ్ ధరించాలన్నారు. విధులలో నీతి, నిజాయితీ, క్రమశిక్షణ తప్పనిసరిగా పాటించాలని సూచించారు. గ్రామాలను సందర్శిస్తూ వీపీవో విధానాన్ని అమలు చేయాలన్నారు. మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలలో అక్రమ రవాణాలను అరికట్టేందుకు కృషి చేయాలని సూచించారు.
రాయితీ బియ్యం, గంజాయి, గుడుంబా తరలకుండా చూడాలని చెప్పారు. డ్రంక్ అండ్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్, ప్రజల రోడ్డు భద్రతా నియమావళిపై అవగాహన కల్పించాలని సూచించారు. బాధితుల సమస్యలు బాధ్యతగా పరిష్కరించాలని, కేసులు పెండింగ్లో ఉండకుండా చూడాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఉట్నూర్ అదనపు ఎస్పీ కాజల్ సింగ్, ఎస్సై ప్రణయ్ కుమార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.