ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా వాన గెరువియ్యడం లేదు. మూడు రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తుండడంతో జనం ఇండ్లు వదిలి బయటకు రావడం లేదు. వర్షానికి తోడు ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు చేరుతుండడంతో వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. చెరువులు మత్తడి దుంకుతుండగా.. జలాశయాలు నిండుకుండలను తలపిస్తున్నాయి. జలపాతాలు జలకళను సంతరించు కోగా.. లోతట్టు ప్రాంతాల్లోని చేలలో నీరు చేరడంతో మొక్కలు మునిగిపోయాయి.
కొంచెం ఆలస్యమైనా వర్షాలు పడుతుండడంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వరి, పత్తి మొక్కలకు ఇటీవల కురుస్తున్న వానలు మేలు చేస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. కాగా.. ఆదిలాబాద్ జిల్లాలో బుధవారం సగటున 53.9 మిల్లీమీటర్ల వర్షం కురియగా, నిర్మల్‌లో 52.3, ఆసిఫాబాద్‌లో 35.2, మంచిర్యాలలో 15.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
– మంచిర్యాల ప్రతినిధి/ఆదిలాబాద్, జూలై 19 ( నమస్తే తెలంగాణ)
మంచిర్యాల ప్రతినిధి/ఆదిలాబాద్, జూలై 19 ( నమస్తే తెలంగాణ) : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మూడు రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తున్నది. నిరంతరంగా కురుస్తున్న వర్షానికి జనాలు ఇండ్లు వదిలి బయటికి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. పలు ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. జలపాతాలు నీటితో కళకళలాడుతున్నాయి. ప్రాజెక్టులు, చెరువుల్లోకి వరద నీరు చేరుతోంది. ఆదిలాబాద్ జిల్లాలో బుధవారం ఉదయం వరకు సగటున అత్యధికంగా 53.9 మిల్లీమీటర్ల వర్షం కురియగా, నిర్మల్‌లో 52.3, ఆసిఫాబాద్‌లో 35.2, మంచిర్యాలలో 15.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆదిలాబాద్ జిల్లాలో తాంసిలో 71.3, ఆదిలాబాద్ అర్బన్‌లో 68.2, ఇంద్రవెల్లిలో 64.4, జైనథ్‌లో 63.5, ఉట్నూర్‌లో 63.2 మిల్లీమీటర్లు నమోదైంది. నిర్మల్ జిల్లాలోని కుంటాలలో 67.6, కుభీర్ 65.1, ముథోల్ 63.9, నిర్మల్ 81.9, తానూర్‌లో 61.8 మిల్లీమీటర్లు కురిసింది. ఆసిఫాబాద్ జిల్లాలో అత్యధికంగా సిర్పూర్(యూ) 69.5, జైనూర్‌లో 67.5, లింగాపూర్‌లో 52.6 మిల్లీమీటర్లు పడింది. మంచిర్యాల జిల్లాలో పెద్దగా వర్షం లేదు. జన్నారంలో 48.9, దండేపల్లిలో 25.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
భారీగా వరద..
భారీ వర్షాలకు వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో వడ్డాది మత్తడి వాగు ప్రాజెక్ట్ నిండుకుండను తలపిస్తున్నది. ఇంద్రవెల్లి మండలంలోని అంజీ చెక్ డ్యాం కట్ట మీద నుంచి వరద నీరు పోతోంది. భారీ వర్షాలకు తాంసి మండలంలో పొన్నారి అంతర్రాష్ట్ర రహదారిపై నుంచి వరద పారుతోంది. ఉట్నూర్ మండలంలో పలు చోట్ల పొలాలు నీటిలో మునిగాయి. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని తిర్యాణి మండలంలో గల చింతల మాదారం జలపాతం జలకళను సంతరించుకున్నది. చింతలమానేపల్లి మండలంలో దిందా-కేతిని వాగు ఉధృతంగా ప్రవహిస్తుండగా, లింగాపూర్ మండలం పట్కల్ మంగి గ్రామ సమీపంలోని బ్రిడ్జిపై నుంచి వాగు ఉప్పొంగుతున్నది. నిర్మల్ జిల్లాలోని పలు గ్రామాల్లో చెరువులు నిండుకుండలను తలపిస్తున్నాయి. కొంచెం ఆలస్యమైనా వర్షాలు పడుతుండడంతో అన్నదాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వరి, పత్తి విత్తనాలు వేసిన రైతులకు ఈ వర్షాలు మేలు చేస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.