నిర్మల్, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ) : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కులవృత్తులు నిరాదరణకు గురయ్యాయి. జీవనోపాధి లేక పొట్టచేత పట్టుకొని వలసబాట పట్టేవారు. ప్రధానంగా కల్లుగీత కార్మికుల పరిస్థితి దుర్భరంగా ఉండేది. లైసెన్స్ పేరిట కార్యాలయాల చుట్టూ తిప్పుకునే వారు. స్వరాష్ట్రం సాకారమైన తర్వాత సీఎం కేసీఆర్ కులవృత్తులకు ప్రాణం పోశారు. అండగా నిలుస్తూ.. రెంటర్ విధానాన్ని రద్దు చేశారు. చెట్లపై పన్నును తొలగించారు. సొసైటీల లైసెన్స్ ఫీజును మాఫీ చేశారు. ఐదేండ్ల కోసారి చేసుకొనే రెన్యూవల్‌ను పదేండ్లకు పొడిగించారు. ఇలా అనేక రకాలుగా అండగా నిలుస్తున్నారు. ఆరోగ్యాన్ని హరిస్తున్న గుడుంబా, నాటుసారాపై ఉక్కుపాదం మోపుతూనే.. నాణ్యమైన కల్లును అందించాలన్న ఉద్దేశంతో కల్లు గీత కార్మికులకు ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు.
నిర్మల్ జిల్లావ్యాప్తంగా 35 సొసైటీలు ఉండగా..754 మంది సభ్యులు ఉన్నారు. ఆయా సొసైటీలు గతంలో యేటా రూ.7.41 లక్షలు లైసెన్స్ ఫీజు రూపంలో ప్రభుత్వానికి చెల్లించేవి. 2018లో టీఆర్ఎస్ ప్రభుత్వం దీనిని పూర్తిగా రద్దు చేసింది. అలాగే చెట్లు గీసుకొని జీవనోపాధి పొందే గీత కార్మికులకు నిర్మల్ జిల్లా వ్యాప్తంగా 204 కల్లు విక్రయ దుకాణాలు ఉండగా, 764 మంది లైసెన్స్‌ను కలిగి ఉండేవారు. వీరంతా గతంలో యేటా రూ.9.77 లక్షలు లైసెన్స్ ఫీజు కింద ప్రభుత్వానికి చెల్లించేవారు. వీటిని కూడా ప్రభుత్వం రద్దు చేసింది. ఇలా యేటా 1,518 మంది గీత కార్మికులు చెల్లించే రూ.17.18 లక్షల ఫీజును మాఫీ చేసిన ఘనత కూడా సీఎం కేసీఆర్‌కే దక్కుతుంది. గత ప్రభుత్వంలో పింఛన్ పథకం వర్తించేది కాదు. స్వరాష్ట్రంలో 50 ఏళ్ల వయస్సు నిండిన వారందరికీ ఆసరా పథకాన్ని వర్తింపజేశారు. దీంతో జిల్లా వ్యాప్తంగా 275 మందికి ప్రతి నెలా రూ.2,016లు అందుతున్నాయి. గతంలో గీత కార్మికులు ప్రమాదవశాత్తు చెట్టుపై నుంచి కింద పడి మరణించినా, శాశ్వత అంగవైకల్యం పొందినా గత ప్రభుత్వాలు వారి కుటుంబానికి కేవలం రూ.2 లక్షలు మాత్రమే పరిహారం ఇచ్చేవి. స్వరాష్ట్రం వచ్చాక ప్రభుత్వం రూ.5 లక్షల పరిహారాన్ని అందిస్తున్నది. అంతేకాకుండా హరితహారంలో భాగంగా ప్రభుత్వం 5,38,168 తాటి, ఈత చెట్లను నాటించింది.
నెలనెలా పింఛన్ వస్తున్నది..
నాకు 52 ఏళ్లు. సీఎం కేసీఆర్ దయవల్ల ప్రతి నెలా గీత కార్మికులకు ఇచ్చే పింఛన్ వస్తున్నది. రోజు కల్లు గీసుకొని అమ్ముకుంటే రూ.300-రూ.500 వస్తయ్. గతంతో పోల్చితే ఇప్పుడు మాకు చాలా బాగుంది. గతంలో ఏడాదికి ఒకసారి లైసెన్సు రెన్యూవల్ కోసం ఎక్సైజ్ ఆఫీసు చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఆ సమ యంలో అధికారులు అందుబాటులో లేకుంటే రోజుల తరబడి మా పనులు మానుకోవాల్సి వచ్చేది. ఆ బాధలు ఇప్పుడు లేవు.
– గుగ్గిల్ల రమేశ్ గౌడ్, గీత కార్మికుడు, దిలావర్పూర్.
గీత కార్మికులకు అండగా ప్రభుత్వం..
గీత కార్మికులకు సీఎం కేసీఆర్ అండగా నిలుస్తున్నారు. అన్ని వర్గాలు, కులాల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారు. గౌడ కులస్తుల కోసం చెట్ల లైసెన్స్ బకాయిలను రద్దు చేశారు. అంతే కాకుండా బీమా పరిహారాన్ని కూడా పెంచారు. లైసె న్స్ రెన్యూవల్ సమయాన్ని రెట్టింపు చేశారు. ఉమ్మడి పాలనలో మేము అనేక ఇబ్బందులు పడ్డాం. గౌడ కులస్తులు కేసీఆర్‌కు ఎప్పటికీ రుణపడి ఉంటారు.
– సంతోష్ గౌడ్, గౌడ సంఘం అధ్యక్షుడు, దిలావర్పూర్.
నాణ్యమైన కల్లును విక్రయించాలి..
గీత కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్ర మాలను అమలు చేస్తున్నది. కల్తీ కల్లు, గుడుంబా, నాటు సారా విక్రయా లను అడ్డుకొని పేదల ప్రాణాలను కాపాడేం దుకు ప్రభుత్వం చెట్ల కల్లును ప్రోత్సహిస్తు న్నది. కల్లును ఎక్కువగా సేవించేది పేదలే ఉంటారు కాబట్టి గీత కార్మికులు నాణ్యమైన కల్లు విక్రయాలు జరపాలి. హరితహారంలో పెద్ద ఎత్తున ఈత, తాటి వనాలను పెంచుతున్నాం. రాబోయే రోజుల్లో వీటి ద్వారా ఆదాయం పొందే అవకాశం ఉంటుంది.50 ఏండ్లు నిండిన కార్మికులందరికీ పింఛన్ అందుతున్నది.
– జీ. శ్రీనివాస్‌రెడ్డి, అసిస్టెంట్ కమిషనర్, అబ్కారీ శాఖ, నిర్మల్