దస్తురాబాద్,అక్టోబర్19 : ఆదివాసీలకు ముఖ్యమైన దీపావళి (దండారీ)పండుగను భోగితో బుధవారం ప్రారంభించారు. సంస్కృతీ సంప్రదాయాలు, నియమ నిష్టలు, భక్తి శ్రద్ధలతో ఈ దండారీ ఉత్సవాలను నిర్వహిస్తారు. దస్తురాబాద్ మండలంలోని గొడిసెర్యాల గోండు గూడెం, మున్యాల గోండు గూడెం, రేవోజీపేట, చెన్నూర్, మల్లాపూర్, భూత్కుర్ తదితర గ్రామ పంచాయతీల్లోని గోండు గూడెల్లో దండారీ ఉత్సవాలు మొదలయ్యాయి. గ్రామ పటేళ్లు ముందుగా వారి కుల దేవతలు, గుస్సాడీ, దండారీ ఏత్మా దేవుడు, కుల దేవతలు, వాయిద్యాలు, నెమలి టోపీలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంప్రదాయ పద్ధతిలో గుస్సాడీ ఆటపాటలు, కోలాటాలతో సందడి చేశారు. గతంలో పొరుగు గ్రామాల్లో విడిదికి వెళ్లిన గుస్సాడీ బృందం, ఈ సంవత్సరం తమ గ్రామానికి ఆయా గ్రామాల గుస్సాడీ బృందాన్ని ఆహ్వానిస్తారు. ఇందులో భాగంగానే గొడిసెర్యాల గోండుగూడెం గ్రామానికి మల్లాపూర్ గోండుగూడెం గుస్సాడీ బృందం రానున్నట్లు గొడిసెర్యాల గోండుగూడెం గ్రామ పటేల్ తెలిపారు. కాగా, మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి మండలంలోని గుడిరేవు గ్రామంలోని గోదావరి ఒడ్డున వెలిసిన కాకోబాయిని దర్శించుకొని, అక్కడే గుస్సాడీ నృత్యాలతో సందడి చేస్తారు. మరుసటి రోజు గ్రామ గుస్సాడీ బృందం వేరే గ్రామానికి, ఈ గ్రామ గుస్సాడీ బృందం ఆ గ్రామానికి విడిదికి వెళ్లడం వీరి ఆనవాయితీ.
కనుల పండువగా..
భీంపూర్, అక్టోబర్ 19 : భీంపూర్, కరంజి(టీ), గుంజాల , భగవాన్పుర తదితర గ్రా మాల్లో దండారీ బృందాలు సంప్రదాయబద్ధ ప్రదర్శనలు చేశాయి. భీంపూర్కు మహారాష్ట్ర వజ్జర్ నుంచి వచ్చిన దండారీ బృందానికి స్థానిక సర్పంచ్ మడావి లింబాజీ, మహాజన్, గిరిజనులు ఆతిథ్యమిచ్చారు. తర్వాత దక్షిణ లు ఇచ్చి ఆచారపరంగా వీడ్కోలు పలికారు. గుంజాల, ఇందూర్పల్లి, మందపల్లి ఆవాసా ల్లో కొలాం ఆదివాసీల దండారీ విలక్షణ రీతి లో అలరించింది. గ్రామగ్రామానా దండారీలను స్వాగతిస్తూ కోలాటాలు తిలకిస్తున్నారు.