ఎదులాపురం, అక్టోబర్ 15 : కక్షిదారులకు రాజీయే రాచమార్గమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంఆర్ సునీత సూచించారు. శనివారం ఆదిలాబాద్‌లోని కోర్టు ప్రాంగణంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహణపై జిల్లా పోలీసు అధికారులతో కలిసి కోఆర్డినేషన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ నవంబర్ 12వ తేదీన జిల్లా కోర్టు ప్రాంగణంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు తెలిపారు.
సివిల్, క్రిమినల్, పీటీ, న్యూసెన్స్, బ్యాంకు, చిట్‌ఫండ్, విద్యుత్ శాఖ, భూ, కుటుంబ తగాదా, చెక్‌బౌన్స్, మోటర్ వాహనాల ప్రమాద భృతి, ఇతర ఫైన్ చెల్లించే కేసులను ఈ లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవాలని కక్షిదారులకు సూచించారు. జిల్లాలోని పీఎస్‌ల వారీగా కక్షిదారులకు సమాచారం అందించి, ఎక్కువ మొత్తంలో కేసులు పరిష్కారమయ్యేలా పోలీసులు సహకరించాలన్నారు.
ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సమావేశంలో న్యాయమూర్తులు డీ మాధవికృష్ణ, సతీశ్ కుమార్, ప్రమీలజైన్, క్షమాదేశ్‌పాండే, యశ్వంత్‌సింగ్ చౌహాన్, అదనపు ఎస్పీ శ్రీనివాసరావు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎర్రల నగేశ్, పీపీలు రమణారెడ్డి, సంజయ్కుమార్వైరాగ్రే, డీవోపీ కిరణ్ కుమార్ రెడ్డి, డీఎస్పీ వీ ఉమేందర్, సీఐ సురేందర్, మల్లేశ్, శ్రీధర్, రఘుపతి, ఎస్ఐలు కోర్టు కానిస్టేబుళ్లు, తదితరులు పాల్గొన్నారు.