మంచిర్యాల టౌన్/రామకృష్ణాపూర్, అక్టోబర్ 10: మంచిర్యాల పట్టణ శివారు ప్రాంతమైన తిమ్మాపూర్ – బొక్కలగుట్ట రోడ్డులో ఆదివారం రాత్రి కారు అదుపు తప్పి కల్వర్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మున్సిపల్ మాజీ చైర్మన్ రాచకొండ కృష్ణారావు కుమారుడు సత్యనారాయణ రావు (సన్నీ) (36) మృతి చెందాడు. ఆయన ప్రస్తుతం బీజేవైఎం మంచిర్యాల పట్టణ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. మిత్రులతో కలిసి పార్టీ చేసుకున్న అనంతరం బొక్కలగుట్ట వైపు నుంచి క్వారీ రోడ్వైపునకు కారులో వస్తుండగా తిమ్మాపూర్ సమీపంలో కల్వర్టుకు కారు ఢీకొట్టింది. ఈ సమయంలో ఆయన వెంట బీజేవైఎం నాయకుడు అశోక్ ఉన్నారు. ప్రమాదంలో కారు కల్వర్టు కిందపడిపోయింది. సత్యనారాయణరావు అక్కడికక్కడే మృతి చెందగా, కారులో ఉన్న అశోక్‌కు సోమవారం తెల్లవారు జామున రెండు గంటల ప్రాంతంలో మెలకువ రాగా ఆయన బంధువులకు సమాచారం ఇచ్చాడు. కాగా సత్యనారాయణరావు తండ్రి కృష్ణారావు 2015 ఫిబ్రవరి 7న హైదరాబాద్ నుంచి తిరిగి వస్తుండగా సిద్దిపేట దాటిన తరువాత జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. ఆ సమయంలో ఆయన భార్య మంజుల తీవ్ర గాయాల పాలయ్యారు. వీరు ప్రయాణిస్తున్న కారుకు ఎదురుగా లారీ రావడంతో ఈ ప్రమాదం జరిగింది. కాగా కృష్ణారావు మంచిర్యాల మున్సిపాలిటీకి మూడు పర్యాయాలు చైర్మన్‌గా పనిచేశారు. ఆయన హయాం లో మంచిర్యాలకు ఉత్తమ మున్సిపాలిటీగా అవా ర్డు లభించింది. 2010 ఉప ఎన్నికల సమయం లో కాంగ్రెస్ పార్టీనుంచి మంచిర్యాల అసెంబ్లీ స్థానానికి పోటీచేసి ఓడిపోయారు. అనంతరం 2014లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి ఆయన భార్య మంజులను 18వ వార్డు నుంచి పోటీలో దించి కౌన్సిలర్‌గా గెలిపించారు. చైర్మన్ స్థానం మహిళ కావడంతో ఆ స్థానాన్ని ఆశించారు. కానీ పదవి లభించలేదు. ఆ తరువాత ఏడాదికి రోడ్డు ప్రమాదంలో ఆయన మృతి చెందారు. అనంతరం 2019లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కొడుకు సత్యనారాయణ రావు బీజేపీ నుంచి 34వ వార్డు కౌన్సిలర్‌గా బరిలోకి దిగాడు. టీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో ఓటమి చెందాడు. అప్పటి నుంచి బీజేపీలో కొనసాగుతున్న సత్యనారాయణరావుకు బీజేవైఎం పట్టణ అధ్యక్షుడిగా పదవి ఇచ్చారు. ఇంతలోనే అనుకోని రీతిలో ప్రమాదం చోటుచేసుకోవడంతో మంచిర్యాలలో విషాదచాయలు నెలకొన్నాయి. ఒక్కగానొక్క కొడుకు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో తల్లి మంజుల ఆస్పత్రి ఆవరణలో రోదించిన తీరు అక్కడి వారిని కలిచివేసింది.
ఎమ్మెల్యే దివాకర్ రావు కంటతడి
సీసీసీ నస్పూర్, అక్టోబర్ 10: రోడ్డు ప్రమాదంలో రాచకొండ సత్యనారాయణ రావు మృతి చెందగా, ఆ కుటుంబాన్ని ఎమ్మెల్యే దివాకర్‌రావు పరామర్శించారు. ఎమ్మెల్యే దివాకర్‌రావు దంపతులు నస్పూర్‌కు చేరుకుని మృతదేహాన్ని చూసి కంటతడి పెట్టారు. మృతుడు సత్యనారాయణరావు తండ్రి కృష్ణారావు ఎమ్మెల్యేకు మంచి మిత్రుడు. కుటుంబ సభ్యులతో వీరి కుటుంబానికి అనుబంధం ఉంది. ఆయన తనయుడు మృతి చెందడాన్ని జీర్ణించుకోలేకపోయారు. నస్పూర్ గోదావరి ఒడ్డున సత్యనారాయణరావు దహన సంస్కారాలు నిర్వహించారు. ఎమ్మెల్యేతో పాటు ప్రజాప్రతినిధులు, నాయకులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరై అంతిమ యాత్రలో పాల్గొన్నారు.