నార్నూర్, అక్టోబర్ 10 : మాతా, శిశు సంరక్షణలో భాగంగా గర్భిణులకు ప్రభుత్వ దవాఖాన్లలో ఉచిత సేవలు అందుతున్నాయి. దవాఖానకు వచ్చేందుకు రవాణా ఇబ్బందులు లేకుండా అమ్మఒడి పథకాన్ని ప్రభుత్వం 2018లో ప్రారంభించింది. డివిజన్ పరిధిలోని ఉట్నూర్, ఇంద్రవెల్లి, నార్నూర్, గాదిగూడలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. వీటి పరిధిలో 102 వాహనాలు నాలుగు ఉన్నాయి. ఈ ప్రత్యేక వాహనాల్లో గర్భిణులతో పాటు వారి సహాయకులు కూర్చునే వీలుంది. అల్ట్రాస్కానింగ్, ఇతర వైద్య పరీక్షలకు రెఫర్ చేసిన గర్భిణులను ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి సీహెచ్‌సీ లేదా దగ్గరలోని ఏరియా దవాఖానకు తీసుకెళ్తారు. పరీక్షల అనంతరం తిరిగి ఇంటికి చేరుస్తారు. క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకున్న గర్భిణుల ప్రసవ తేదీని వైద్యులు ముందుగానే నిర్ణయించి, ఆ విషయాన్ని 102 వాహన సిబ్బందికి సమాచారం అందిస్తారు. ఈ పథకం ద్వారా ఉట్నూర్ డివిజన్ పరిధిలో 2018 నుంచి ఇప్పటి వరకు 30,607ట్రిప్పుల ద్వారా 88,534 మందికి సేవలందించింది.
మాతాశిశు సంరక్షణకు పెద్దపీట
ఉట్నూర్ డివిజన్లో మాతా, శిశు సంరక్షణకు పెద్దపీట వేస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో సీఎం కేసీఆర్ వైద్య సేవలను బలోపేతం చేశారు. ఈ క్రమంలో దవాఖాన్లలో వసతులు మెరుగుపర్చడంతో పాటు నిపుణులైన వైద్యులను అందుబాటులోకి తీసుకువచ్చారు. గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించేందుకు వినూత్న కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. అంగన్వాడీల ద్వారా నిరంతరం పర్యవేక్షణ చేయిస్తున్నారు. ప్రైవేట్ దవాఖాన్లలో ప్రసవాలు చేయించుకొని ఆర్థికంగా చితికిపోతున్న కుటుంబాలను దృష్టి పెట్టుకొని ప్రభుత్వ దవాఖాన్లలో డెలివరీలకు ప్రోత్సహిస్తున్నారు. కేసీఆర్ కిట్ అమలుతో సర్కారు దవాఖాన్లలో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నది. దీనికి తోడు 102 వాహనాలు గర్భిణులు, బాలింతలకు విస్తృత సేవలు అందిస్తున్నాయి.
అపూర్వ స్పందన
అమ్మఒడి పథకానికి అపూర్వ స్పందన లభిస్తున్నది. గతంలో ప్రభుత్వ దవాఖాన్లలో ప్రసవాలు అయితే బాలింతలు ఇంటికి వెళ్లేందుకు ప్రత్యేక వాహనానికి వేల రూపాయలు ఖర్చయ్యేవి. ఇప్పుడు అమ్మఒడి పథకం ద్వారా ఉచితంగానే రవాణా సౌకర్యం కల్పిస్తున్నారు. ప్రసవం సమయంలోనే కాకుండా గర్భందాల్చిన నాటి నుంచి నెలలు నిండే వరకు వివిధ రకాల వైద్య పరీక్షలకు సైతం102 వాహనాల్లో ఉచిత రవాణా సదుపాయం, వైద్య సేవలు కూడా అందుతుండడం విశేషం. ప్రసవం అనంతరం తల్లీబిడ్డలను క్షేమంగా ఇంటి వద్ద దించుతున్నారు. ఆ తర్వాత శిశువుకు వివిధ దశల్లో టీకాలు ఇప్పించేందుకు కూడా 102 వాహనాలను వినియోగించుకోవచ్చు. 102 నంబర్‌కు ఫోన్ చేయగానే వాహనం ఇంటి ముందుకు వస్తుంది.
జాప్యం లేకుండా సేవలు…
అమ్మఒడి వాహనాల ద్వారా బాలింతలు, గర్భిణులు, శిశువులకు అద్భుత సేవలు అందుతున్నాయి. ఆరోగ్య పరీక్షల నుంచి ప్రసవాల దాకా ఈ వాహనాల్లో మహిళలను సకాలంలో దవాఖాన్లకు, మళ్లీ అక్కడి నుంచి ఇంటికి చేరవేస్తున్నాం. ఉట్నూర్ డివిజన్లో 102 నంబర్‌కు వచ్చే ఫోన్ల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంది. మారుమూల ప్రాంతాలు, గిరిజన తండాల్లో ప్రైవేట్ వాహన సౌకర్యం లేనివారికి ఈ పథకం ఎంతగానో లబ్ధి చేకూరుస్తున్నది. ఫోన్ చేయగానే ఎలాంటి జాప్యం లేకుండా వాహనాలు అందుబాటులో ఉంచుతున్నాం.
-కొండల్రావ్, ఉట్నూర్ డివిజన్ ఇన్చార్జి అధికారి