మంచిర్యాల అర్బన్, అక్టోబర్ 9 : పశు సంవర్ధక శాఖలో గోపాలమిత్రలుగా పని చేస్తున్న వారికి ముఖ్యమంత్రి కేసీఆర్ దసరా పండుగ సందర్భం గా కానుక అందించారు. వేతనాలు పెంచుతూ జీవో జారీ చేశారు. దీంతో జిల్లాలోని 25 మందికి ప్రయోజనం చేకూరనున్నది. పశు సంరక్షణలో క్షేత్రస్థాయిలో ముఖ్య భూమిక పోషిస్తున్న గోపాల మిత్రలు.. వేతనాల పెంపుతో మరింత ఉత్సాహంగా పని చేయనున్నారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పా టుకు ముందు 17 మంది ఉన్న గోపాలమిత్రలు ప్రస్తుతం 25 మందికి చేరుకున్నారు. వీరు పశువుల సంరక్షణ, దూడల పోషణ, కృత్రిమ గర్భధారణ, పశుగ్రాసం పెంపకంపై రైతులకు అవగాహన కల్పిస్తారు. నట్టల నివారణ మందుల పంపి ణీ, వ్యాక్సినేషన్ వంటి పనుల్లో పశువైద్య సిబ్బందికి సహాయపడుతుంటారు. సేవలను గుర్తించి వేతనాలు పెంచడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గోపాలమిత్రల వేతనాలు పెంచడం ఇది రెండోసా రి. గతంలో వీరి వేతనాలు రూ.3,500 ఉండగా, పెరిగిన నిత్యావసర సరుకుల ధరలను దృష్టిలో ఉంచుకొని 2017లో ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.8, 500కు పెంచి వారి కుటుంబాల్లో సంతోషాన్ని నింపారు. ఈ ఏడాది దసరా పండుగ సందర్భం గా మరో 30 శాతం (రూ.2,550) పెంచుతూ జీవో జారీ చేశారు. దీంతో వీరి జీతాలు రూ.11, 050కు పెరిగాయి. జిల్లాలో 25 మంది గోపాలమిత్రలకు ప్రయోజనం చేకూరింది. లక్షెట్టిపేట మండలంలో ముగ్గురు, మందమర్రిలో ముగ్గురు, భీమారం, జన్నారం, దండేపల్లి, హాజీపూర్, బెల్లంపల్లి మండలాల్లో ఇద్దరు చొప్పున, నస్పూర్, చెన్నూర్, జైపూర్, నెన్నెల, కాసిపేట, కన్నెపల్లి, వేమనపల్లి, తాండూరు, భీమిని మండలాల్లో ఒక్కొక్కరు చొప్పున గోపాలమిత్రలు విధులు నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయంతో వీరందరికీ లబ్ధి చేకూరింది.
మా కష్టాలను ముఖ్య మంత్రి కేసీఆర్ గుర్తించి వేత నాలు పెంచడం ఆనందంగా ఉంది. గత ప్రభుత్వాల పాలనలో రెండు, మూడు వేలతో విధులు నిర్వహించాం. రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ 2017లో ఒకసారి, ఈ దసరాకు రెండోసారి వేతనాలు పెంచి మా కుటుంబాలకు అండగా నిలిచారు. పశువుల సేవలో మరింత ఉత్సాహంగా పని చేస్తాం.
– రాసమల్ల వేణుగోపాల్, గోపాలమిత్ర, ఆర్అండ్ఆర్ తాళ్లపేట్, నస్పూర్
దసరా కానుకగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మాకు జీతాలు పెంచుతూ జీవో జారీ చేయడం హర్షించదగ్గ విషయం. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మాకు రెండోసారి వేతనాలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇది మాకు, మా కుటుంబానికి సంతోషకరమైన వార్త. గోపాలమిత్రలందరూ ముఖ్యమంత్రికి రుణపడి ఉంటారు.
– ఐత రవి, గోపాలమిత్ర సంఘం జిల్లా అధ్యక్షుడు, మంచిర్యాల