2022-23 సంవత్సరానికి గాను వానకాలం ధాన్యం సేకరణకు పౌర సరఫరాల శాఖ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. అక్టోబర్ మూడో వారం నుంచి వరి కోతలు ప్రారంభమయ్యే అవకాశం ఉండగా.. నవంబర్ మొదటి వారంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈ లోపు కొనుగోళ్లపై సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని చూస్తున్నారు. కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అన్ని సదుపాయాలు కల్పించనున్నారు. ధాన్యం సేకరించిన 24 గంటల్లోగా డబ్బులు కూడా రైతుల ఖాతాల్లో జమ చేయాలని యంత్రాంగం భావిస్తున్నది.కాగా.. సర్కారు గతంలో కంటే మద్దతు ధరను పెంచింది. గ్రేడ్-ఏ రకానికి క్వింటాలుకు రూ.2060, సాధారణ రకానికి రూ.2040 ఇవ్వనున్నారు.
నిర్మల్, సెప్టెంబర్ 25(నమస్తే తెలంగాణ) : రైతుల నుంచి వానకాలం పంట ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి పౌర సరఫరాల శాఖ ముందస్తు ప్రణాళిక ఖరారు చేసింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా 3.25 లక్షల ఎకరాల్లో వరి సాగవగా.. 6.67 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. ఇందుకోసం 446 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ధాన్యం సేకరణ చేసి నింపడానికి 1.06 కోట్ల గన్నీ సంచులు అవసరం కాగా.. 44.42 లక్షలు అందుబాటులో ఉన్నాయి. వచ్చే నెల మూడో వారం నుంచి వరి కోతలు ప్రారంభమయ్యే అవకాశం ఉండడంతో నవంబర్ మొదటి వారంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈలోపు కొనుగోళ్లపై సిబ్బందికి శిక్షణ పూర్తి చేయనున్నారు. కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అన్ని సదుపాయాలు కల్పించనున్నారు.
ఈసారి ప్రభుత్వం వరి మద్దతు ధరను రూ.100 పెంచడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రేడ్-ఏ రకం క్వింటాలుకు రూ.2,060, సాధారణ రకానికి రూ.2,040 చెల్లించనున్నారు. ఈసారి సకాలంలో వర్షాలు కురియడంతో వరి పంట ఆశాజనకంగా ఉంది. కోతలు ముందుగానే ప్రారంభం కానున్న నేపథ్యంలో ముందస్తుగానే కేంద్రాలను కూడా ఏర్పాటు చేసేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లను ముమ్మరం చేసింది. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంట వెంటనే రైస్ మిల్లులకు కస్టమ్ మిల్లింగ్ కోసం తరలించనున్నారు. ఒక లారీకి సరిపడా ధాన్యం బస్తాల తూకం పూర్తయిన వెంటనే కస్టమ్ మిల్లింగ్ కోసం తరలిస్తారు. ఈ వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో పొందుపర్చనున్నారు. దీంతో ధాన్యం విక్రయించిన రైతులకు 24 గంటల్లో వారి బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయి.
నిర్మల్ జిల్లావ్యాప్తంగా 1.21 లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా.. హెక్టారుకు 55 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని యం త్రాంగం భావిస్తున్నది. ఈ విధంగా 2.66 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయ, పౌర సరఫరాలశాఖ అధికారులు అంచనా వేశారు. ఇందులో స్థానిక అవసరాల కోసం 93,170 మెట్రిక్ టన్నులు, సీడ్ కోసం 18,600 మెట్రిక్ టన్నులు పోగా… మిగిలిన 1.54 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. 180 కేంద్రాల ద్వారా కొనుగోళ్లను చేపట్టేందుకు అధికారులు ప్రణాళిక ఖరారు చేశారు. ఇందులో ఐకేపీ 32, జీసీసీ 5, డీసీఎంఎస్ 66, పీఏసీఎస్ 77 ఉన్నాయి. 38 లక్షల గన్నీ బ్యాగులు అవసరం కాగా, ప్రస్తుతం 27 లక్షల సంచులు సిద్ధంగా ఉన్నాయి. మిగతా గన్నీ బ్యాగులను వివిధ రూపాల్లో సేకరించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే మిల్లర్ల నుంచి సంచులు తెప్పించుకున్న పౌర సరఫరాల శాఖ అధికారులు.. రేషన్ షాపుల్లోని బ్యాగులను సేకరించే పనిలో పడ్డారు. రేషన్ దుకాణాల్లోని ఒక్కో సంచికి రూ.21లు వెచ్చించనున్నారు. గన్నీ బ్యాగుల సేకరణ పూర్తి కాగానే కొనుగోళ్లు చేపట్టనున్నారు.
మంచిర్యాల జిల్లాలో సాధారణ వరి సాగు విస్తీర్ణం 1.31 లక్షల ఎకరాలు కాగా.. 1.48 లక్షల ఎకరాలు సాగైంది. దిగుబడి అంచనా 3.56 లక్షల మెట్రిక్ టన్నులు కాగా.. స్థానిక అవసరాల కోసం 1.24 లక్షల మెట్రిక్ టన్నులు తీయనున్నారు. గన్నీ సంచులు 57.94 లక్షలు అవసరం కాగా.. 13.42 లక్షలు అందుబాటులో ఉన్నాయి. 236 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తుండగా.. ఇందులో ఐకేపీ 59, పీఏసీఎస్ 114, డీసీఎంఎస్ 63 ఉండనున్నాయి.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో వరి విస్తీర్ణం 55,534 ఎకరాలు. 45 వేల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందులో 45 వేల మెట్రిక్ ట న్నుల ధాన్యాన్ని సేకరించనున్నారు. 10.35 లక్షల గన్నీ సం చులు అవసరం కాగా.. 4 లక్షలు అందుబాటులో ఉన్నా యి. 30 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనుండగా.. ఇందులో ఐకేసీ 6, సహకార సంఘాల ద్వారా 24 ఉండనున్నాయి.